Guava Leaves : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో జామకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జామకాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జామకాయల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. కానీ జామకాయల్లో కంటే జామచెట్టు ఆకుల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. జామ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేసే శక్తి జామ ఆకులకు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి చిగుళ్ల వాపు, నోటిపూత, నోట్లో పుండ్లు, గొంతునొప్పి వంటి సమస్యలను నయం చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సమస్యలతో బాధపడే వారు లేత జామ ఆకులను నమిలినా లేదా జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.
అధిక బరువుతో బాధపడే వారికి జామ ఆకుల కషాయం చక్కని టానిక్ లా పని చేస్తుంది. జామ ఆకుల కషాయాన్ని తరచూ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగి ఊబకాయం సమస్య నుండి బయట పడవచ్చు. కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వారు జామ ఆకులను చిన్న మంటపై వేడి చేసి నొప్పి ఉన్న చోట ఉంచి కట్టు కట్టడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి కూడా జామ ఆకులకు ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
జామ ఆకులను నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ భోజనం చేసేటప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని మొదటి ముద్దగా తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమై మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. జామ ఆకులను నేరుగా నమిలి తిన్నా కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, నల్ల మచ్చలతో బాధపడే వారు జామ ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోతాయి.
జామ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి అర గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య కూడా పోతుంది. ఈ విధంగా జామ ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని.. వీటిని వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా వాటి బారిన కూడా పడకుండా ఉంటామని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.