Bellam Appalu : మనం ఎన్నో రకాల పదార్థాలను వంటింట్లో వండుతూ ఉంటాం. అలాగే మనకు కొన్ని సాంప్రదాయ వంటకాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో బెల్లం అప్పాలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. బెల్లం అప్పాలు ఎంతో రుచిగా ఉంటాయి. బెల్లం అప్పాలను తయారు చేయడం కూడా చాలా సులభమే. సంప్రదాయ వంటకమైన ఈ బెల్లం అప్పాలను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, యాలకులు – 4, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
బెల్లం అప్పాల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలను, యాలకులను వేసి మెత్తని పొడి అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో గోధుమ పిండిని, బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. తరువాత ఒక కళాయిలో బెల్లం తరుమును, నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకుని వేడి చేయాలి. ఇప్పుడు ఈ బెల్లం మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసి కలపాలి.
తరువాత గోధుమ పిండి, బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం వేడిగా ఉంటుంది. కనుక ముందు గంటెతో కలిపి చల్లారిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కొద్దిగా మందంగా ఉండేలా అప్పాల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అప్పాలన్నీ వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె కాగిన తరువాత తగినన్ని అప్పాలను వేసుకుంటూ మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. అప్పాలను కదుపుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యేలా కాల్చుకోవాలి. అప్పాలు ఎర్రగా వేగి పైకి తేలిన తరువాత వాటిని గంటె సహాయంతో గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం అప్పాలు తయారవుతాయి. ఈ అప్పాలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా సులభంగా, రుచిగా బెల్లం అప్పాలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేసిన బెల్లం అప్పాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.