Kashayam : వాతావరణ మార్పుల కారణంగా మనలో చాలా మంది జలుబు, దగ్గు బారిన పడుతుంటారు. కొందరు గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వీటన్నింటికీ కారణం మనలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఈ కారణంగా మనం వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడుతున్నామని వైద్యులు చెబుతున్నారు. వీటి బారిన పడిన తరువాత యాంటీ బయోటిక్స్ ను వాడడానికి బదులుగా వీటి బారిన పడకుండా ఉండడమే మంచిదని వారు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటూనే వంటింట్లో ఉపయోగించే పదార్థాలతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మనం జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాం. ప్రస్తుత కాలంలో చాలా మంది కషాయాన్ని తయారు చేసుకుని తాగుతున్నారు. అయితే చాలా మంది ఈ కషాయాన్ని ఎలా పడితే అలా ఏవి పడితే అవి వేసి తయారు చేసుకుని తాగుతున్నారు. దీని వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కొన్ని తెచుకుంటున్నారు. అసలు ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. కషాయం తయారీలో ఏయే పదార్థాలను వాడాలి.. ఆ పదార్థాలను ఎంత మోతాదులో వాడాలి.. కషాయాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కషాయాన్ని మనం వంటింట్లో ఉపయోగించే పదార్థాలతో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కషాయాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకోవాలి. ఇందులో 10 మిరియాలను, 4 లవంగాలను, 3 చిన్నగా చేసిన దాల్చిన చెక్క ముక్కలను, 3 బిర్యానీ ఆకులను, ఒక టీ స్పూన్ కచ్చా పచ్చాగా చేసిన అల్లం ముక్కలను వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఒక గుప్పెడు తులసి ఆకులను వేసి రెండు కప్పుల నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెపై మూత పెట్టాలి.
మూడు నిమిషాల తరువాత మూత తీసి కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక కప్పులో ఒక టీ స్పూన్ తేనె వేసి అందులో గోరు వెచ్చగా ఉన్న కషాయాన్ని పోసి కలుపుకుని తాగాలి. ఇలా చేసుకున్న కషాయాన్ని వారానికి రెండు సార్లు తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్, బాక్టీరియాల బారిన పడకుండా ఉంటాం. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడే వారు అవి తగ్గే వరకు రోజుకు రెండు పూటలా ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.