Orange Peel Tea : సాధారణంగా నారింజ పండ్లను తినగానే చాలా మంది వాటి తొక్కలను పడేస్తారు. కానీ వీటితో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లలాగే మనకు తొక్కలు కూడా ఎంతో మేలు చేస్తాయి. కనుక నారింజ పండ్ల తొక్కలను ఇకపై పడేయకండి. వీటితో టీ తయారు చేసుకుని రోజుకు ఒకసారి తాగవచ్చు. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. నారింజ పండ్ల తొక్కలతో టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ తొక్కల టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నారింజ పండు తొక్కలు – రెండు, నీళ్లు – కప్పున్నర, దాల్చిన చెక్క – చిన్న ముక్క, లవంగాలు – మూడు, ఆకు పచ్చ యాలకులు – రెండు, బెల్లం – ఒక టీస్పూన్.
నారింజ తొక్కల టీ ని తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో నీళ్లు పోసి మంటను మధ్యస్థంగా ఉంచి వేడి చేయాలి. దీంట్లో బెల్లం తప్ప నారింజ పండు తొక్కలతోపాటు ఇతర పదార్థాలన్నీ వేయాలి. రెండు మూడు నిమిషాలు బాగా మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి టీని కప్పులోకి వడకట్టుకోవాలి. ఇందులో బెల్లం కలపాలి. దీంతో వేడి వేడి ఆరెంజ్ పీల్ టీ రెడీ అవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని రోజుకు ఒకసారి అయినా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఇంకా ఈ టీని తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.