Bachali Kura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది అందించే ప్రయోజనాలు తెలిస్తే అసలు ఎవరూ దీన్ని విడిచిపెట్టరు. అయితే బచ్చలికూరను ఎలా వండుకోవాలి ? అని సందేహించేవారు.. కింద తెలిపిన విధంగా దాన్ని వండుకుని తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అనేక పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి బచ్చలికూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

బచ్చలికూర తయారీకి కావల్సిన పదార్థాలు..
బచ్చలి కూర తరిగింది – రెండు కప్పులు, పసుపు – అర టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత, ఎండు మిర్చి – నాలుగు, పచ్చి మిర్చి – నాలుగు, వెల్లుల్లి తరిగింది – ఒక టేబుల్ స్పూన్, నువ్వుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – నాలుగు రెబ్బలు, పోపు దినుసులు – సరిపడా, నూనె – రెండు టేబుల్ స్పూన్లు.
బచ్చలికూర తయారు చేసే విధానం..
కళాయిలో నూనె వేడెక్కిన తరువాత పోపు దినుసులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి తరుగు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. నిమిషం తరువాత బచ్చలికూర తరుగుతోపాటు పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. ఆకు దగ్గరయ్యాక నువ్వుల పొడి చల్లి రెండు నిమిషాల తరువాత దించేయాలి. దీంతో ఎంతో రుచికరమైన బచ్చలికూర రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఈ కూరను తింటే మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.