Kakarakaya Fry : కాకరకాయ చేదుగా ఉంటుంది అన్న మాటే. కానీ కాకరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. కాకరకాయలో శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన పోషకాలన్నీ ఉంటాయి. కొందరు కాకరజ్యూస్ ను కూడా తాగుతూ ఉంటారు. కాకరకాయ వేపుడుతోపాటు కాకరకాయతో రకరకాల వంటలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చేదు లేకుండా రుచిగా కాకరకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ వెల్లుల్లి కారం వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకర కాయలు – అర కిలో, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – ఒక టీ స్పూన్, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, నూనె – కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి పాయ – 1, ఎండు మిర్చి – 8, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
కాకర కాయ వెల్లుల్లి కారం వేపుడు తయారీ విధానం..
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకోవాలి. తరువాత కాకరకాయలను గుండ్రంగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మ రసం వేసి చేత్తో కాకరకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక కాకరకాయ ముక్కల నుండి నీటిని పిండుతూ నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, ఎండు మిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా మిగిలిన ఉప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను, మిక్సీ పట్టుకుని ఉంచిన వెల్లుల్లి కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఈ వేపుడు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాకరకాయను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కాకరకాయ షుగర్ వ్యాధిని నియంత్రించడమే కాకుండా, శరీరంలో కొవ్వు స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. కాకరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.