సాధారణంగా చాలా మంది ఆకలి వేస్తే స్నాక్స్ రూపంలో చిరుతిండి తింటుంటారు. కొందరు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ లాగించేస్తారు. అయితే నిజానికి వీటిని తినడం వల్ల ఆకలి తీరదు. ఇంకా పెరుగుతుంది. వాటిని తినేకొద్దీ ఇంకా తినాలనే అనిపిస్తుంటుంది. కారణం.. అవి జంక్ ఫుడ్ కావడమే. అయితే వాటికి బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓ వైపు శరీరానికి పోషకాలు అందుతాయి. మరోవైపు శక్తి లభిస్తుంది. ఈ రెండింటినీ అందించే ప్రోటీన్ లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు
- ఖర్జూరాలు – 120 గ్రాములు
- చిన్న చిన్న ముక్కలుగా దంచిన బాదంపప్పు – 2 టేబుల్ స్పూన్లు
- అవిసె గింజల పొడి – 2 టేబుల్ స్పూన్లు
- చియా విత్తనాల పొడి – 2 టేబుల్ స్పూన్లు
- కొకొవా పొడి – 2 టేబుల్ స్పూన్లు
- ముక్కలుగా కట్ చేసిన నలుపు రంగు కిస్మిస్‌లు – 2 టేబుల్ స్పూన్లు
- అల్లం రసం – 1 టేబుల్ స్పూన్
- యాలకుల పొడి – అర టీస్పూన్
- బాదం నూనె – 1 టీస్పూన్
- దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూన్
- కొబ్బరి తురుము – తగినంత
ప్రోటీన్ లడ్డూలను తయారు చేసే విధానం
అన్ని పదార్ధాలను బాగా కలపాలి. నిమ్మకాయ సైజులో ఉండే విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అనంతరం వాటిని కొబ్బరి తురుములో వేసి బాగా దొర్లించాలి. దీంతో తురుము వాటికి పడుతుంది. తరువాత 15 నిమిషాల పాటు వాటిని ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. ప్రోటీన్ లడ్డూలు తయారవుతాయి. వాటిని ఎప్పుడైనా తినవచ్చు. కాకపోతే స్నాక్స్‌కు బదులుగా వాటిని తింటే శక్తికి శక్తి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.