Sajja Rotte : మనకు లభించే చిరు ధాన్యాలలో సజ్జలు ఒకటి. అధిక ఉష్ణోగ్రతలలో కూడా పండే పంటలలో సజ్జలు ఒకటి. మన శరీరానికి సజ్జలు ఎంతో మేలు చేస్తాయి. సజ్జలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. నియాసిన్, థయామిన్, రైబో ప్లేవిన్ వంటి విటమిన్స్ తోపాటు ఐరన్, కాల్షియం, సోడియం, జింక్, ఫాస్పరస్ వంటి మినరల్స్ ను, ప్రోటీన్లను సజ్జలు కలిగి ఉంటాయి. సజ్జలు రక్త హీనతను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మలబద్దకం సమస్య తగ్గుతుంది.
శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సజ్జలు సహాయ పడతాయి. సజ్జలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించడంలో సజ్జలు దోహదపడతాయి. సజ్జలతో రొట్టెలను అధికంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ రొట్టెలను మరింత రుచిగా ఉండే మసాలా రొట్టెలుగా తయారు చేసుకోవచ్చు. మసాలా సజ్జ రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు.. వాటి తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా సజ్జ రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జ పిండి – 90 గ్రా., బియ్యం పిండి – 10 గ్రా., తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 15 గ్రా., తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – 15గ్రా., అల్లం ముక్కలు – 15 గ్రా., జీలకర్ర – 5 గ్రా., నూనె – 15 గ్రా., నీళ్ళు – సరిపడా, తరిగిన కరివేపాకు – 5 గ్రా., ఉప్పు – తగినంత.
మసాలా సజ్జ రొట్టె తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సజ్జ పిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నీళ్ళు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని చేత్తో చపాతీలా ఒత్తుకుని పెనంపై వేసి కొద్దిగా నూనెను వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా సజ్జ రొట్టె తయారవుతుంది. ఈ రొట్టెను నేరుగా లేదా ఏదైనా కూర, పచ్చళ్ల తో కలిపి తినవచ్చు. సజ్జలతో ఇలా రొట్టెను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.