Cough : ప్రస్తుతం చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చాలా మందికి దగ్గు మరీ ఎక్కువగా వస్తోంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఎంతటి దగ్గు అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..
1. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో పిప్పళ్లు బాగా పనిచేస్తాయి. అర టీస్పూన్ పిప్పళ్ల పొడి, కొద్దిగా పసుపును తీసుకుని 200 ఎంఎల్ నీటిలో కలపాలి. 5 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. అందులో రుచి కోసం కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తాగితే చాలు, దగ్గు వెంటనే తగ్గిపోతుంది. జలుబు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
2. అల్లంను 5 గ్రాముల మేర తీసుకుని బాగా తురమాలి. అనంతరం దాన్ని 200 ఎంఎల్ నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, తేనెలను కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. అతి మధురం చూర్ణం ఒక టీస్పూన్, 3-4 పుదీనా ఆకులను తీసుకుని 200 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించి అనంతరం వచ్చే నీటిని వడకట్టాలి. తరువాత అందులో కొద్దిగా బెల్లం పొడి కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని రోజుకు 3 సార్లు తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది.
4. తులసి ఆకులు 7 నుంచి 10, లవంగాలు 2, యాలకులు 2 తీసుకుని 200 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. రోజుకు దీన్ని 2 సార్లు తాగాలి.
5. వాము గింజలను 5 గ్రాముల మోతాదులో తీసుకుని పెనంపై వేసి కొద్దిగా వేయించాలి. 4-5 లవంగాలను తీసుకుని ముందుగా వేయించుకున్న వాము గింజలతో కలపాలి. వీటిని పొడిలా చేయాలి. అనంతరం ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనె కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీని వల్ల దగ్గు సమస్య నుంచి బయట పడవచ్చు.