యాంటీ ఏజింగ్ ఫుడ్స్: చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు, ఎల్లప్పడూ యవ్వనంగా కనిపించేందుకు చాలా మంది సౌందర్య సాధన ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ నిజానికి అవి పెద్దగా పనిచేయవు. కేవలం మనం తినే ఆహారంతోనే చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. అందుకు గాను యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. అవి మన చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
మనం తినే ఆహారాల వల్లే మనకు సహజసిద్ధమైన చర్మ సౌందర్యం లభిస్తుంది. ఆయా ఆహారాల వల్లే వృద్ధాప్య చాయలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. చర్మం టోన్‌ను మెరుగు పరుచుకోవాలన్నా అందుకు తగిన ఆహారాలను నిత్యం మనం తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకు, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేందుకు ఎలాంటి ఆహారాలను తరచూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర, బ్రోకలీ
కూరగాయలను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచేందుకు సహాయపడతాయి.
టమాటాలు
టమాటాలను నిత్యం మనం పలు ఆహారాల్లో భాగంగా తీసుకుంటుంటాం. టమాటాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు సహాయపడుతాయి. ఈ పండ్లలో లైకోపీన్ ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుండి మీ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది.
దానిమ్మ
దానిమ్మపండు రక్తహీనతను తొలగించడమే కాక చర్మాన్ని కాపాడుతుంది. ఇది అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది.
బొప్పాయి
చర్మ సంరక్షణకు బొప్పాయి సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి సమృద్ధిగా కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి మేలు చేస్తుంది. చర్మానికి ఉపయోగపడుతుంది. ఈ పండును తినడం వల్ల లేదా దీంతో ఫేస్ ప్యాక్‌లు చేసుకుని ఉపయోగించడం వల్ల ముఖం మీద ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి.
అవకాడో
అవకాడోలో విటమిన్ ఎ, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అవకాడోలో ఉండే విటమిన్ ఎ చర్మం నుండి మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని కెరోటినాయిడ్లు శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అవకాడో చర్మ క్యాన్సర్ రాకుండా చూస్తుంది.