Black Hair Remedies : జుట్టు తెల్లగా ఉంటే సహజంగానే ఎవరికీ నచ్చదు. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడితే అప్పుడు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి అనేక క్రీములు గట్రా ఉపయోగిస్తుంటారు. కానీ అవన్నీ తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం అన్నది ఉండదు. దీనికి తోడు అవన్నీ రసాయనాలతో తయారు చేస్తారు. కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీంతోపాటు ఇతర జుట్టు సమస్యలు కూడా పోతాయి. చుండ్రు ఉండదు. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. అందుకు ఏయే చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టును నల్లగా మార్చడంలో బ్లాక్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. పాలు కలపకుండా తయారు చేసిన బ్లాక్ టీ కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక కప్పు టీకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును జోడించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా తలకు పట్టించాలి. జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. తరువాత అర గంట పాటు ఉండి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 3 సార్లు చేయాలి. దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇతర జుట్టు సమస్యలు కూడా ఉండవు.
జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును నల్లగా మార్చడంలో ఉసిరికాయ, కొబ్బరినూనె మిశ్రమం కూడా బాగానే పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. ఉసిరికాయలలోని గింజలను తీసేసి ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయలు కొన్ని తీసుకుని పొడి చేయాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని పావు కప్పు కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. కాస్త వేడి చేశాక దాన్ని రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని వడకట్టి అనంతరం వచ్చే నూనెను సేకరించి జుట్టుకు బాగా రాయాలి. ఇలా రాసిన తరువాత అర గంటపాటు ఉండి తలస్నానం చేయాలి. దీన్ని కూడా వారంలో మూడు సార్లు చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు నల్లగా మారుతుంది.
జుట్టును నల్లగా మార్చేందుకు గోరింటాకు మిశ్రమం కూడా బాగానే పనిచేస్తుంది. గోరింటాకుల పొడిలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఉడికించాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. దీంతో తప్పక ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు ఉండదు. శిరోజాలు దృఢంగా మారి పొడవుగా పెరుగుతాయి.