Long Hair : జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, చుండ్రు, మానసిక ఆందోళన, ఒత్తిడి, ఇతరత్రా అనారోగ్య సమస్యలను జుట్టు రాలడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. ఇలా బయట లభించే వాటిని వాడడం వల్ల ఫలితం లేకపోగా వాటి వల్ల దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేక విసుగు చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. జుట్టు రాలే సమస్యను ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెను రోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని మనం అరికట్టవచ్చు. అలాగే మనం వాడే కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయి ఉండాలి. మనకు మార్కెట్ లో లభించే కొబ్బరి నూనె స్వచ్ఛమైనదో, నకిలీదో తెలియదు. నకిలీ కొబ్బరి నూనెను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గకపోగా సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. కనుక మన ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనెను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు.

కొబ్బరి నూనెను ఇంట్లో మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక కొబ్బరి కాయను తీసుకుని దాని నుండి కొబ్బరిని వేరు చేయాలి. ఇలా వేరు చేసిన కొబ్బరిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గోరు వెచ్చని నీటిని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో మరిన్ని గోరు వెచ్చని నీటిని పోసి జల్లిగంటెతో లేదా వస్త్రం సహాయంతో కొబ్బరి పాలను వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొబ్బరి పాలను వడకట్టగా మిగిలిన పిప్పిని మరోసారి మిక్సీ పట్టి దాని నుండి కూడా పూర్తిగా కొబ్బరి పాలను తీసుకోవాలి.
ఈ కొబ్బరి పాలను ఒక రోజంతా డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి. మరుసటి రోజు గడ్డకట్టిన కొబ్బరి పాలను ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై వేడి చేయాలి. దీనిని ఒక గంట పాటు వేడి చేయగా వెన్న నుండి నెయ్యి మాదిరిగా కొబ్బరి పాల నుండి కొబ్బరి నూనె వస్తుంది. ఇలా వచ్చిన కొబ్బరి నూనెను ఒక సీసాలో తీసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నూనెను రోజూ తలకు రాసి కుదుళ్లలోకి ఇంకేలా మర్దనా చేయాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం జుట్టు రాలడం సమస్య నుండి బయట పడవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.