Motion Sickness : చాలా మందికి ప్రయాణాలు చేయాలి అంటే చాలా ఇష్టం. పని ఒత్తిడి నుంచి బయట పడడానికి ఫ్యామిలీతో కలిసి దూరప్రాంతాలకు ప్రయాణం అవుతుంటారు చాలా మంది. మరికొంత మందికి ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతాయి అనే భావనతో ప్రయాణం చెయ్యాలంటే భయపడిపోతుంటారు. చాలా మందికి బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అంటున్నారు చాలా మంది నిపుణులు.
ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు మనకు వాంతులు అవుతాయేమో అనే ఆలోచనను కూడా మన మనసులోకి రాకుండా చూసుకోవాలి. బస్సులో ప్రయాణించేటప్పుడు ముందు సీట్ లో కూర్చోడం వల్ల బయట వాతావరణం కనిపించడం వల్ల వాంతులు అవుతాయి అనే విషయాన్ని మరిచిపోయే అవకాశం ఉంటుంది.
అలాగే మన పక్కన ఉన్న వాళ్లతో కూడా మాట్లాడటం, ఇష్టమైన పాటలు వినడం, కామెడీ వీడియోలు అలాంటివి చూసి మన మైండ్ డైవర్ట్ చేసుకోవడం వంటివి చేస్తే సాధ్యమైనంత వరకు వాంతులు అవకుండా చూసుకోవచ్చు. అలా చేసిన కూడా వాంతులు అవుతాయి అని అనుకుంటే కొంచెం అల్లం తీసుకోవడం లేక నిమ్మకాయ వాసన చూడడం వంటివి కూడా చేయవచ్చు. ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలాలి. దీంతో చాలా వరకు వాంతులు రాకుండా చూసుకోవచ్చు. లేదా ప్రయాణం మధ్యలో నిమ్మకాయను వాసన చూస్తుండాలి.
ఇక ప్రయాణం మధ్యలో గ్రీన్ టీ తాగడం లేదా ఐస్ క్యూబ్స్ తినడం లేదా ప్రయాణానికి ముందు చాలా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వంటివి చేయడం వల్ల కూడా ప్రయాణం మధ్యలో వాంతులు కాకుండా ఆపవచ్చు. దీంతో సమస్య అదుపులో ఉంటుంది. అయితే ఏది ఏమైనా కూడా ముందుగా మనకు వాంతులు అవుతాయి అనే భావనను మన మైండ్‌లోకి రానీయకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు.