Bad Breath : మనల్ని వేధించే నోటి సంబంధిత సమస్యల్లో నోటి దుర్వాసన కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మందే ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారు నలుగురిలో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనిని వైద్య పరిభాషలో హలిటోసిస్ అంటారు. శరీరంలో ఉండే ఇతర రుగ్మతల కారణంగా, దంతాలను సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం వంటి కారణాల వల్ల నోటిదుర్వాసన సమస్య వస్తుంది. నోటి దుర్వాసన సమస్య నుండి బయటపడడానికి వివిధ రకాల టూత్ పేస్ట్ లను, మౌత్ వాష్ లను ఉపయోగిస్తూ ఉంటారు. వీటితో పాటు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు.
నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మరసంలో ఉప్పును లేదా బేకింగ్ సోడాను వేసి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా తరచూ చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. లవంగాలను ఉపయోగించి కూడా మనం నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. తరచూ లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించడం, నమలడం వంటివి చేయడం వల్ల నోరు ఎప్పుడూ తాజాగా ఉండి నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది.
నోటి దుర్వాసనను తగ్గించడంలో సోంపు గింజలు దివ్యౌషధంగా పని చేస్తాయి. ఈ సోంపు గింజల్లో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను కలిగించే బాక్టీరియాలను నశింపజేస్తాయి. రోజూ కొన్ని సోంపు గింజలను తినడం లేదా సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వంటివి చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కాఫీని తాగడం మానేసి గ్రీన్ టీ ని తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
అలాగే జామ ఆకులను నీటిలో వేసి మరిగించిన తరువాత ఆ నీటిలో ఉప్పును కలపాలి. ఇలా ఉప్పు కలిపిన నీటిని నోట్లో పోసుకుని తరచూ పుక్కిలిస్తూ ఉండడం వల్ల నోటి దుర్వాసన సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే వేప పుల్లతో లేదా కానుగ పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా నోటిదుర్వాసన తగ్గుతుంది. అదే విధంగా తరుచూ పుదీనా, తులసి ఆకులను నములుతూ ఉండడం వల్ల నోరు తాజాగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడంతోపాటు రోజూ దంతాలను రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిట్కాలను పాటించడం వల్ల నోటిదుర్వాసన సమస్య నుండి బయటపడవచ్చు.