Dry Grapes With Honey : మనం వంటింట్లో అప్పుడప్పుడూ తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ తీపి పదార్థాల తయారీలో రుచి కోసం ఎక్కువగా ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. ఎండు ద్రాక్ష తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎండు ద్రాక్షను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేసే వాటినే ఎండు ద్రాక్ష, కిస్ మిస్ అని అంటారు. తక్కువ బరువుతో బాధపడే వారికి ఎండుద్రాక్ష దివ్యౌషధంగా పని చేస్తుంది. తరచూ ఎండుద్రాక్షను తినడం వల్ల వీటిలో ఉండే ఫ్రక్టోస్, గ్లూకోజ్ లు శరీరానికి తగినంత శక్తిని ఇచ్చి బరువు పెరిగేలా చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఎండు ద్రాక్షను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల గొంతు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని తొలగించి, దగ్గు వంటి సమస్యలు రాకుండా చేయడంలో ఎండుద్రాక్ష మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండుద్రాక్షను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ఎండుద్రాక్షతోపాటు సోంపు గింజలను కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అయ్యి మలబద్దకం సమస్య తగ్గుతుంది.
వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నివారిస్తాయి. అంతేకాకుండా తరచూ ఎండుద్రాక్షను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. వీటిని తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఎండు ద్రాక్షను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఎండుద్రాక్షను ఒక రాత్రంతా తేనెలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల పురుషుల్లో వచ్చే అంగస్తంభన సమస్య తగ్గి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఎండుద్రాక్షలతో అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. కనుక వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.