Itchy Scalp Home Remedies : తలలో దురద అనే ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య కారణంగా కలిగే అసౌకర్యం, బాధ, చిరాకు అంతా ఇంతా కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య మరీ అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. తలలో దురద రావడానికి అనేక కారణాలు ఉంటాయి. చెమట, చుండ్రు, తల చర్మం పొడిబారడం, తల చర్మం యొక్క పిహెచ్ స్థాయిలల్లో మార్పులు రావడం, హార్మోన్ల అసమతుల్యత, తలలో వైరస్ మరియు బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లు రావడం ఇలా అనేక కారణాల చేత ఈ సమస్య వస్తుంది. తలలో దురద వంటి సమస్యతో బాధపడే వారు అనేక రకాల షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. ఇలా షాంపులను వాడడంతో పాటు ఇప్పుడు చెప్పే కొన్ని విషయాలను పాటించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
తలలో దురద సమస్యతో బాధపడే వారు ముందుగా ఇతరుల దువ్వెనలను, దిండ్లను, టోపీలను వాడడం మానేయాలి. అలాగే వీరి దువ్వెనలను కూడా ఇతరులు వాడవద్దు. తలలో దురద సమస్యను తగ్గించడంలో కలబంద జెల్ కూడా ఎంతగానో సహాయపడుతుంది. తల చర్మానికి కలబంద గుజ్జు రాసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలచర్మం పొడిబారకుండా ఉంటుంది. తల చర్మానికి తగిన తేమ అందుతుంది. దురద కూడా తగ్గుతుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు తలచర్మంపై పేరుకుపోయిన నూనెలు, మురికి, నశించిన చర్మ కణాలు తొలగిపోయేలా బాగా శుభ్రం చేసుకోవాలి. తలచర్మం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
షాంపుతో పాటు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ ను వాడడం వల్ల అదనంగా పోషణ లభిస్తుంది. దీంతో తలచర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు జుట్టు కూడా ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అలాగే తలలో దురద సమస్యతో బాధపడే వారు రసాయనాలు కలిగిన షాంపులకు బదులుగా యాపిల్ సైడ్ వెనిగర్, పెరుగు, గుడ్డు, బేకింగ్ సోడా, నిమ్మరసం వంటి వాటిని వాడాలి. అలాగే పుదీనా, టీ ట్రీ, జోజోబా, వేప నూనెలను వాడడం వల్ల దురద నుండి ఉపశమనం కలుగుతుంది. తల చర్మానికి రక్తప్రసరణ పెరిగేలా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద తగ్గడంతో పాటు జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. పోషకాలు కూడా చక్కగా అందుతాయి. అదే విధంగా తలస్నానం చేసేటప్పుడు వేడి నీటిని ఉపయోగించడం మానేయాలి.
చల్లటి నీరు లేదా గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల తలచర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. అలాగే వారానికి మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి. ఇక తలచర్మం పొడిబారకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే రోజూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వీటితో పాటు తలలో దురద సమస్యతో బాధపడే వారు కఠినమైన రసాయనాలు కలిగిన షాంపులను వాడడం మానేయాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా తలలో దురద సమస్య నుండి బయటపడవచ్చు.