Mangu Machalu : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో మంగు మచ్చలు కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మంగు మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎండకు ఎక్కువగా తిరగడం, హార్మోన్ల అసమతుల్యత, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వాడే మందుల కారణంగా, రసాయనాలు ఎక్కువగా ఉండే కాస్మోటిక్స్ ను వాడడం వల్ల, అలాగే పొడి చర్మం ఉన్న వారిలో ముఖం పై ఈ మంగు మచ్చలు ఏర్పడతాయి. అలాగే గర్భిణీ స్త్రీలల్లో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అయితే వారిలో ఈ సమస్య కొద్ది రోజుల పాటు ఉండి తరువాత మచ్చలు తొలగిపోతాయి. ఈ మచ్చలు ముక్కుపై, నుదుటి మీద, బుగ్గలపై ఎక్కువగా వస్తూ ఉంటుంది.
ఈ మచ్చల వల్ల ఎటువంటి హాని కలగనప్పటికి ఇవి చూడడానికి అందవిహీనంగా ఉంటాయి. ఈ మంగు మచ్చలను ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం తగ్గించుకోవచ్చు. మంగు మచ్చలతో బాధపడే వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మంగు మచ్చలను తగ్గించడంలో మనకు బంగాళాదుంప మనకు ఎంతగానో ఉపయోపడుతుంది. అడ్డంగా తరిగిన బంగాళాదుంప ముక్కను తీసుకుని మంగు మచ్చలపై 15 నుండి 20 పాటు రాస్తూ మర్దనా చేయాలి. తరువాత మరో పది నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల మర్దనా చేసిన చోట రక్తప్రసరణ చురుకుగా జరుగుతుంది. దీంతో మచ్చలు తగ్గి ఆ ప్రదేశంలో చర్మం సాధారణ స్థితికి వస్తుంది.
అలాగే కలబంద గుజ్జును ఉపయోగించి కూడా మనం మంగు మచ్చలను నివారించుకోవచ్చు. కలబంద గుజ్జును తీసుకుని మంగు మచ్చలపై రాస్తూ మర్దనా చేయాలి. ఇలా రాసిన తరువాత 10 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంగు మచ్చల నుండి బయట పడవచ్చు. అదే విధంగా నిమ్మకాయ ముక్కను తీసుకుని మంగు మచ్చలపై 15 నిమిషాల పాటు రాస్తూ ఉండాలి. తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా క్రమంగా మంగు మచ్చలు తగ్గుతాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మనం మంగు మచ్చలను తొలగించుకోవచ్చు.