Padala Pagullu : మనలో చాలా మందికి పాదాల అడుగునా చర్మం గరుకుగా, మృత కణాలు ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. ఇలా పాదం అడుగున చర్మం మీద మృత కణాలు పేరుకుపోవడం వల్ల కొంత కాలానికి ఆ భాగంలో పగుళ్లు ఏర్పడతాయి. పగుళ్ల ఏర్పడడంతో పాటు ఆ భాగంలో రంగు మారడం, చర్మం మరింత గరుకుగా మారడం జరుగుతుంది. అలా గరుకుగా ఉన్న చర్మాన్ని మృదువుగా మార్చడానికి, పాదాల పగుళ్లను తగ్గించడానికి, పాదాల అడుగున ఉండే ఆనకాయల వంటి వాటిని తొలగించడానికి మనం ఆహారంగా తీసుకునే ఒక ఫలం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పాదాల పగుళ్లను నివారించే ఫ్రూట్ మరేదో కాదు పైనాపిల్. పైనాపిల్ ఎక్కువగా ఆమ్లా తత్వాన్ని కలిగి ఉంటుంది. పైనాపిల్ కు ఉండే తత్వం కారణంగానే అసిడిటి సమస్య ఉన్న వారు ఈ పండును తినడం వల్ల కడుపులో మంట వంటి ఇబ్బంది కలుగుతుంది.
పాదాల పగుళ్లతో బాధపడే వారు ఈ పైనాపిల్ ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పైనాపిల్ ను ముక్కలుగా చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాదాల అడుగు భాగానికి చక్కగా పట్టించాలి. దీనిని 45 నిమిషాల పాటు పాదాలకు అలాగే ఉంచాలి. పైనాపిల్ లో ఉండే ఆమ్లాలు పాదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయేలా చేస్తాయి. పాదాలపై పేరుకుపోయిన మృతకణాల పొరలన్నింటిని ఈ పైనాపిల్ చక్కగా తొలగిపోయేలా చేస్తుంది. ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయడం వల్ల గరుకుగా ఉండే చర్మం అంతా తొలగిపోయి మృదువుగా ఉండే చర్మం బయటకు వస్తుంది. పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి.
అలాగే ఆనకాయలతో బాధపడే వారు కూడా ఈ చిట్కాను వాడడం వల్ల గట్టిగా ఉండే చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ చిట్కాను అప్పుడప్పుడూ పాటించడంతో పాటు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుని మర్దనా చేయాలి. తరువాత పాదాలను శుభ్రం చేసుకునే బ్రష్ తో లేదా రాళ్లతో పాదాలను రుద్దడం వల్ల పాదాలపై మృతకణాలు పేరుకుపోకుండా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా పాదాల పగుళ్లను నివారించుకోవచ్చని పాదాలను మృదువుగా, మెత్తగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.