Pippi Pannu : మనలో చాలా మందిని వేధించే దంత సంబంధిత సమస్యలల్లో పిప్పి పన్ను సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ బాధపడుతూ ఉంటారు. పిప్పి పన్ను వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. పిప్పి పన్ను వల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. పిప్పి పన్ను వల్ల దవడ నొప్పి, తలనొప్పి కూడా వస్తుంది. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, శీతల పానీయాలను తీసుకోవడం, ఫైబర్ తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల మనకు ఈ సమస్య తలెత్తుతుంది.
మనం తీసుకునే ఆహారంలో ఉండే కణాలు దంతాల మధ్య పేరుకుపోతాయి. దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అక్కడ స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనే బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది. ఈ బ్యాక్టీరియానే దంతాలు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం అవుతాయి. కనుక మనం దంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దంతాలపై ఎనామిల్ దెబ్బతినకుండా చూసుకోవాలి. పిప్పి పన్ను వంటి దంత సమస్యలు మన దరి చేరకుండా ఉండాలంటే మనం కొన్నిజాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పిప్పి పన్ను సమస్య రాకుండా ఉండాలంటే మనం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ లను నమలాలి. దీని వల్ల స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనే బ్యక్టీరియా వృద్ది చెందకుండా ఉంటుంది. దంతాల ఎనామిల్ పాడవకుండా ఉంటుంది. అలాగే దంతాలు ధృడంగా ఉండాలంటే క్యాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.
అలాగే ఫ్లోరైడ్ ఉండే టూత్ పేస్ట్ లను ఉపయోగించాలి. వీటిని వాడడం వల్ల సూక్ష్మ క్రిముల నుండి దంతాలకు హాని కలగకుండా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడూ నీటిలో ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశిస్తాయి. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చెరుకు గడ్డలు, నారింజ వంటి పండ్లను బాగా నమలాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన క్రిములు, పాచి తొలగిపోతాయి. అలాగే తీపి పదార్థాలను తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల పిప్పి పన్ను సమస్య మన దరి చేరకుండా ఉంటుంది.