Scorpion Bite : మన చుట్టూ ఉండే విష కీటకాల్లో తేలు కూడా ఒకటి. తేలు కాటుకు గురయినప్పుడు చాలా నొప్పి, మంట ఉంటాయి. కొందరిలో ఈ విష ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. కుట్టింది చిన్న తేలే కదా అశ్రద్ధగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. పెద్ద తేలుకు ఎంత విషం ఉంటుందో అంతే విషం అప్పుడే పుట్టిన తేలులోనూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి విష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
తేలు కుట్టినప్పుడు పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తేలు కుట్టిన చోట ఉత్తరేణి ఆకుల రసాన్ని రాసి బాగా మర్దనా చేయడం వల్ల తేలు విషం హరిస్తుంది. మైలతుత్తుం పొడికి నీటిని కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తేలు కాటుకు గురయిన ప్రదేశంలో రాయడం వల్ల విషం తగ్గుతుంది. అలాగే మామిడి కాయ సొనను తేలు కుట్టిన ప్రదేశంలో రాసినా మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర ఉల్లిపాయను సగానికి కోసి ఆ ముక్కను తీసుకుని తేలు కుట్టిన చోట రుద్దడం వల్ల మంట తగ్గుతుంది.
అదే విధంగా గాయమాన చెట్టు ఆకులను తుంచినప్పుడు ఆ చెట్టు నుండి ఒకరకమైన ద్రవం కారుతుంది. ఆ ద్రవాన్ని తేలు కుట్టిన చోట రాసినా కూడా విష ప్రభావం తగ్గుతుంది. నిమ్మ రసాన్ని లేదా బొప్పాయి పండ్ల పాలను తీసుకుని తేలు కుట్టిన చోట మర్దనా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. చింతగింజను అడ్డంగా ముక్కలుగా చేసి రాయిపై వేడి వచ్చేలా రుద్దాలి. ఇలా రుద్దిన తరువాత ఆ గింజను తేలు కుట్టిన చోట ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా జీలకర్రను, సైంధవ లవణాన్ని కలిపి మెత్తగా పొడిగా చేయాలి. ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల కూడా విష ప్రభావం తగ్గుతుంది. ఇంగువను నిమ్మరసంలో అరగదీసి ఆ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట రాయడం వల్ల తేలు విషం హరిస్తుంది. తేలు కుట్టిన వెంటనే ఈ చిట్కాలను పాటించడం వల్ల విష ప్రభావం కొంతమేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను ప్రథమ చికిత్సగా పాటించి వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వారు తెలియజేస్తున్నారు.