Joint Pain : సాధారణంగా వయసుపై బడిన వారిలో కీళ్ల నొప్పులు రావడం సహజం. వయసు పెరిగే కొద్దీ ఎముకలు డొల్లగా మారిపోవడం, అరగడం వంటి కారణాల వల్ల కీళ్ల నొప్పుల సమస్య వస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధిక బరువు ఉండడం, సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే ఈ సమస్య బారిన పడే వారు ఎక్కువవుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి మందులను లేదా శస్త్ర చికిత్సలను వైద్యులు సూచిస్తూ ఉంటారు.
ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ కీళ్ల నొప్పుల సమస్య నుండి మనం కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల నొప్పులు, వాపుల నుండి కొంతమేర ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను తీసుకోవాలి. తరువాత ఈ నూనెలో అర చెక్క నిమ్మరసాన్ని పిండి రెండూ కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని అర గంట సమయం వరకు ఎండలో ఉంచాలి.
తరువాత ఈ తైలాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నొప్పుల ఉన్న చోట రాయాలి. తరువాత ఈ నూనె చర్మంలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా మర్దనా చేసిన గంట సమయం తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వీలున్న వారు ఈ తైలాన్ని రాత్రి పడుకునే ముందు నొప్పులు, వాపులు ఉన్న చోట రాసుకుని ఉదయాన్నే కడిగేయవచ్చు. ఇలా చేయడం వల్ల క్రమంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి. ఈ చిట్కాను పాటించడంతోపాటు మనం తినే ఆహారంలో కూడా నువ్వులు, నిమ్మ రసం ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎక్కువగా మందులు మింగే అవసరం లేకుండానే కీళ్ల నొప్పుల నుండి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.