దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు గాను కేంద్రం గతంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవలకు గాను ప్రస్తుతం కస్టమర్లు ఎలాంటి రుసుమును చెల్లించడం లేదు. కానీ కొన్ని బిల్ పేమెంట్లకు మాత్రం ఇప్పటికే ఫోన్‌పే, గూగుల్ పేలలో సర్వీస్ చార్జిని వసూలు చేయడం ప్రారంభించారు. కొన్ని యూపీఐ యాప్‌లలో కార్డులను వాడితే కన్వీనెన్స్ ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై ఆయా యూపీఐ యాప్‌లలో డబ్బులు పంపినా కూడా చార్జిలను వసూలు చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు గాను కేంద్రం మర్చంట్లకు సబ్సిడీని ఏటా అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే 2023లో ఈ సబ్సిడీ మొత్తం రూ.2600 కోట్లు ఉండగా 2024 లో దాన్ని రూ.2484 కోట్లకు కుదించారు. ఈ ఏడాది ఈ మొత్తాన్ని ఏకంగా రూ.477 కోట్లకు కుదించారు. అంటే మర్చంట్లకు అందే సబ్సిడీ మొత్తం తగ్గుతుందన్నమాట. దీంతో ఖర్చులను భరించేందుకు గాను మర్చంట్లు ఆ చార్జిలను వినియోగదారులపైనే మోపుతున్నారు. ఇప్పటికే ఫోన్‌పే లేదా గూగుల్ పే వంటి యాప్‌లలో కొన్ని రకాల సర్వీస్‌లను ఉపయోగించుకుంటే సర్వీస్ చార్జిని వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో యూపీఐ ద్వారా చేసే నగదు బదిలీలకు కూడా చార్జిలను వసూలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేస్తున్నారు. 60 నుంచి 70 శాతం వరకు లావాదేవీలు డిజిటల్ రూపంలోనే పూర్తవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఉన్నపళంగా వినియోగదారుల మీద చార్జిలు పడితే అప్పుడు వారు డిజిటల్ చెల్లింపులను చేయకపోవచ్చు. మునుపటిలా క్యాష్ చెల్లింపులే చేస్తారు. మరి అలా జరిగితే కేంద్రం ఉద్దేశం నెరవేరదు. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది.