భారతదేశంలో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారన్న విషయం విదితమే. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాలు కనుమరుగై పోగా, మరికొందరు తమ తమ ఆచారాలను, వ్యవహార శైలిని మరిచిపోయారు. కానీ రాజస్థాన్‌లోని ఆ వర్గానికి చెందిన ప్రజలు మాత్రం కొన్ని వందల ఏళ్ల కిందటి తమ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే అదేదో మూఢాచారం మాత్రం కాదు. వారు పాటిస్తున్న ఆ ఆచారం వెనుక ఓ సామాజిక హితం ఉంది. మనుషులతోపాటు సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క జీవికి బతికే హక్కు ఉంది. వాటికీ ప్రాణం ఉంది. అవి కూడా ఓ వర్గానికి చెందిన జీవులే. మనుషులు, అవి వేర్వేరు కావు, అన్నీ జీవరాశులే అనే సత్యాన్ని ఆ వర్గానికి చెందిన ప్రజలు చాటి చెబుతున్నారు.
రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో నివాసం ఉంటున్న బిష్ణోయ్ వర్గానికి చెందిన ప్రజలు గత 550 సంవత్సరాల నుంచి జింకలను పెంచుతూ వాటి సంఖ్యను వృద్ధి చేస్తున్నారు. ఆ వర్గానికి చెందిన మహిళలు తమ పసిపిల్లలతోపాటు ఆ జింక పిల్లలకు చిన్నప్పటి నుంచి తమ పాలిచ్చి పెంచుతూ వాటికి కూడా తాము తల్లులమే అని తమ మాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన 2వేల కుటుంబాలు ఉండగా వారందరూ జింకలను పెంచుతున్నారు.
ఇదంతా ఎందుకని వారిని ప్రశ్నిస్తే జింకలు తమ కుటుంబాల్లో ఒక భాగమని, అవి తమ కుటుంబ సభ్యుల్లా తమ వద్దే ఉంటాయని వారు చెబుతున్నారు. జింకలను పెంచడం అనాది నుంచి వస్తోందని, ఎంతో మంది వేటగాళ్ల బారి నుంచి వాటిని కాపాడుతూ వస్తున్నామని అంటున్నారు. తమ పిల్లలు, ఆ జింక పిల్లలు సొంత అన్నదమ్ముల్లాగే పెరుగుతాయని వారు తెలియజేస్తున్నారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా జింకలను పెంచడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు. తమ సిద్ధాంతం ప్రకారం ప్రకృతిని, జంతువులను, జీవరాశులను రక్షించాలని చెబుతున్నారు. అంతేకాదు వారికి జింక అత్యంత పవిత్రమైన జంతువట. సృష్టిలోని అన్ని జీవరాశులను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని చాటి చెబుతున్న బిష్ణోయ్ వర్గ ప్రజల సాంప్రదాయాన్ని నిజంగా మనం అభినందించాల్సిందే!