చెట్టు మీద పండిన పండ్లనే తినాలి. రసాయనాలు వేసి పండించిన పండ్లను తినరాదు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అయినప్పటికీ చాలా మందికి అసలు ఏది సహజసిద్ధంగా పండిందో, ఏది రసాయనాలు వేసి పండిన పండో తెలియడం లేదు. వ్యాపారులు తమ లాభమే ధ్యేయంగా యథేచ్ఛగా రసాయనాలను వాడుతూ పండ్లను పండిస్తున్నారు. ఈ సీజన్‌లో వస్తున్న మామిడి పండ్లే కాదు, యాపిల్, అరటి, అవకాడో, నారింజ, బొప్పాయి, జామ, పైనాపిల్ వంటి అనేక పండ్లను రసాయనాలు వేసి కృత్రిమంగా పండిస్తున్నారు. దీంతోపాటు టమాటాల వంటి కూరగాయలపై కూడా రసాయనాలు చల్లి పండించి వాటిని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అసలు వ్యాపారులు ఏయే రసాయనాలను వాడి పండ్లను కృత్రిమంగా పండిస్తారో, వాటి వల్ల మనకు ఎలాంటి హాని కలుగుతుందో, రసాయనాలను వాడి పండించిన పండ్లను ఎలా గుర్తు పట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండ్లు లేదా కూరగాయలు వేటినైనా కృత్రిమంగా పండించడానికి నేడు చాలా మంది వాడుతున్న రసాయనాలు ఏవంటే… కాల్షియం కార్బైడ్, ఎథిలీన్, ఎథిపాన్‌లు ముఖ్యమైవని. వీటినే చాలా మంది వ్యాపారులు పండ్లను కృత్రిమంగా పండించేందుకు వాడుతున్నారు. వీటితో పండించిన పండ్లను, కూరగాయలను తినడం వల్ల మనకు ఎలాంటి హాని కలుగుతుందంటే… రసాయనాలు వేసి పండించిన పండ్లను తింటే దాంతో వాటిలో ఉండే పోషకాలు మాయం అవుతాయి కాబట్టి, వాటిని తిన్నా మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. దీనికి తోడు విష పదార్థాలు మన శరీరంలోకి వెళ్లి అనారోగ్యాలను కలిగిస్తాయి. అవన్నీ కార్సినోజెన్లను మన శరీరంలోకి పంపుతాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.
ఇక అలాంటి కృత్రిమ పండ్లను తినడం వల్ల ఇంకా ఏం జరుగుతుందంటే… వాంతులు, విరేచనాలు, డయేరియా సమస్యలు వస్తాయి. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యలు కూడా వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తాయి. దృష్టి సరిగ్గా ఉండదు. చూపు మందగిస్తుంది. విపరీతమైన దాహం వేస్తుంది. నోరు, ముక్కు, గొంతు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కూడా వస్తాయి. పేగుల్లో అల్సర్ వస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. తలనొప్పి, జ్ఞాపకశక్తి తగ్గుదల, మబ్బుగా ఉండడం, నిద్రలేమి, ఫిట్స్ కూడా రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో అయితే బీపీ పెరుగుతుంది. దీంతోపాటు చేతులు, కాళ్లు స్పర్శను కూడా కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. అదే గర్భిణీలకు అయితే కడుపులో ఉండే బిడ్డకు హాని కలుగుతుంది. బిడ్డ సరిగ్గా ఎదగదు.
కృత్రిమంగా పండించిన పండ్లన్నీ దాదాపుగా ఒకే రంగులో ఉంటాయి. రంగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. అదే సహజ సిద్ధంగా పండినవైతే రంగుల్లో తేడా ఉంటుంది. అన్ని పండ్లు ఒకే రంగులో ఉండవు. ఒకే జాతి అయినప్పటికీ వేర్వేరు రంగుల్లో ఉంటాయి. కృత్రిమంగా పండించిన పండ్లపై బూడిద రంగులో ప్యాచ్‌లు దర్శనమిస్తాయి. బాగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది. అరటి పండు తొడిమ గ్రీన్ కలర్‌లో ఉండి పండు పసుపు రంగులో ఉంటే వాటిని కృత్రిమంగా పండించినవిగా తెలుసుకోవాలి. సహజ సిద్ధంగా పండినవి అయితే తొడిమ కూడా పసుపు రంగులోనే ఉంటుంది. సహజ సిద్ధంగా పండిన కూరగాయలు, పండ్లు ఆకర్షణీయంగా ఉండవు. కానీ కృత్రిమంగా పండినవి మాత్రం మెరుపులు మెరుస్తాయి. కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సీజన్ ఆరంభానికి ముందే మార్కెట్‌లోకి వచ్చే పండ్లను కొనరాదు. వాటిని కచ్చితంగా కృత్రిమంగానే పండిస్తారు. కృత్రిమంగా పండిన పండ్లు మెత్తగా, మృదువుగా ఉంటాయి. సహజ సిద్ధంగా పండినవి కొంచెం గట్టిదనం కలిగి ఉంటాయి.
అసలు ఇలా కృత్రిమంగా పండ్లను, కూరగాయలను పండించడాన్ని అనేక దేశాలు నిషేధించాయి. మన దేశంలోనూ ఇలా చేయడం పై నిషేధం ఉంది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు లాభాపేక్షతో అలా పండ్లను పండిస్తూ జనాల ఆరోగ్యాలతో ఆటాడుకుంటున్నారు. ఇలాంటి నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక విజిలెన్స్ ఉన్నా అంత బలోపేతంగా ఆ శాఖ ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో వ్యాపారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా మీరు మాత్రం ఏవైనా పండ్లను, కూరగాయలను కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ వాటిని కొనండి. లేదంటే తెలుసు కదా, అనారోగ్యాల బారిన పడతారు.