మల్టీప్లెక్స్ స్క్రీన్లు లేదా సాధారణ థియేటర్లలో సినిమాలు చూసేటప్పుడు చాలా మంది ప్రేక్షకులు పాప్ కార్న్ తింటారు కదా. సాధారణ థియేటర్స్ మాటేమోగానీ మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్‌లకు గాను ప్రేక్షకుల్ని వీరబాదుడు బాదుతారు. చాలా తక్కువ మొత్తంలో ఇచ్చే పరిమాణానికే ఎక్కువ ధర వసూలు చేస్తారు. 50, 100, 200 గ్రాముల్లో అందించే పాప్ కార్న్‌లకు మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు ప్రేక్షకుల నుంచి రూ.100, రూ.200 అలా వసూలు చేస్తారు. అయినప్పటికీ చాలా మంది ఆ రేటు చూడరు. వాటిని కొనుక్కుని మరీ తింటారు. అయితే నిజానికి మీకు తెలుసా..? ఒక రైతు పండించే కేజీ మొక్కజొన్నలకు, అలా మల్టీప్లెక్స్‌లలో పాప్ కార్న్‌లుగా అమ్మే మొక్క జొన్నలకు రేటులో ఎంత వ్యత్యాసం ఉంటుందో..? అది తెలిస్తే మీరు షాకవుతారు.
మొక్కజొన్న రైతులకు లభిస్తున్న కనీస మద్దతు ధర ఎంతో తెలుసా..? క‌్వింటాల్‌కు రూ.2200. ఈ క్రమంలో రైతుల పండించిన మొక్క జొన్నలకు క్వింటాల్‌కు రూ.2000 నుంచి రూ.2300 వరకు వస్తోంది. సరే… మనం రైతుకు రూ.2000 వస్తుందనుకుందాం. అప్పుడు కిలో మొక్కజొన్నలకు వచ్చేది ఎంత..? 2000/100 = 20 రూపాయలు. అంటే 1000 గ్రాములు (1 కిలో) మొక్క జొన్నలకు రైతులకు వచ్చేది రూ.20 మాత్రమే. అదే మల్టీప్లెక్స్‌లలో 100 గ్రాముల పాప్ కార్న్ ధర ఎంతో తెలుసా..? రూ.150కి పైగానే ఉంటుంది. అంటే రూ.20 కిలో చొప్పున రైతుల వద్ద మొక్కజొన్నలు కొనే ఆ కంపెనీలు తిరిగి ఆ మొక్కజొన్నలను పాప్‌కార్న్ రూపంలో విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల నుంచి ఆయా కంపెనీలు పిండుకునే డబ్బు ఎంత ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా రైతు అమ్మే ధరనే పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు 100 గ్రాములకు రూ.2 మాత్రమే అవుతుంది. దీనికి పాప్‌కార్న్ తయారీ, ఇతర ఖర్చులు కలిపినా అది రూ.10 మించదు. అలాంటప్పుడు 100 గ్రాముల పాప్‌కార్న్ ఎంతకు అమ్మాలి. మహా అయితే రూ.20 వరకు (డబుల్ లాభం వచ్చేలా చూసుకుంటే) అమ్ముకోవాలి. కానీ మల్టీప్లెక్సుల్లో అమ్ముతున్నది ఎంత..? అంతకు 7.5 రెట్లు ఎక్కువగా రూ.150 కి పైగానే అమ్ముతున్నారు. దీన్ని బట్టి మల్టీప్లెక్సుల యాజమాన్యాలు మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొక్కజొన్నలు పండించే ఓ రైతుకు జరుగుతున్న అన్యాయం మన కళ్ల ముందే ఇలా కనిపిస్తోంది. అలాంటప్పుడు మనం అంతటి రేటు పెట్టి పాప్ కార్న్ కొనడం కరెక్టేనా..? ఓ సారి మీరే ఆలోచించండి..! మనమే అలా చేస్తే ఇక రైతులకు ఏం లాభం జరుగుతుంది..?