పిడికెడంత కూడా ఉండని నిమ్మకాయ పుల్లని రుచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటలు, రిఫ్రెషింగ్ డ్రింక్స్, గార్నిషింగ్, స్కిన్ కేర్ ఇలా తరచూ ఏదొక విధంగా రోజూ ఉపయోగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ సమస్యను నివారించేందుకు నిమ్మరసం తరచూ తాగుతుంటారు. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంటుంది. కాబట్టి, ప్రతి ఇంట్లో నిమ్మకాయలు స్టోర్ చేసుకునే అలవాటు ఉంటుంది. అయితే, నిమ్మకాయలు చాన్నాళ్లు నిల్వ ఉండవు. వేగంగా నల్లగా మారిపోయి రసం తగ్గిపోతుంది. ఈ సులభమైన ట్రిక్స్ పాటిస్తే మాత్రం నిమ్మకాయలు నెలల తరబడి చెడిపోకుండా తాజాగా ఉంటాయి. మీరు నిల్వ చేయడానికి నిమ్మకాయలు కొంటున్నట్లయితే శుభ్రంగా, మచ్చలు లేని నిమ్మకాయలను కొనండి. ఒకవేళ నిమ్మకాయపై ఏదైనా మరక లేదా మచ్చ కనిపిస్తే వెంటనే దాన్ని తొలగించండి. ఎందుకంటే వీటివల్లే నిమ్మకాయలు త్వరగా చెడిపోతాయి.
ఎల్లప్పుడూ నిల్వ కోసం తాజా నిమ్మకాయలనే కొనండి. అప్పుడే అవి నెలల తరబడి ఉంటాయి. తాకడానికి మృదువుగా ఉంటూ పల్చని తొక్కలు కలిగిన జ్యుసీ నిమ్మకాయలనే నిల్వ కోసం కొనండి. మందంగా ఉన్న తొక్కలు కలిగిన నిమ్మకాయలతో పోలిస్తే వీటిలో రసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, త్వరగా ఆవిరైపోవు. ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో ఒక చెంచా లేదా రెండు చెంచాల వెనిగర్ కలపండి. ఇప్పుడు అన్ని నిమ్మకాయలను ఈ వెనిగర్ లో పది నిమిషాలు నానబెట్టండి. తర్వాత వీటిని శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి ఒక పాత్రలో ఉంచండి. ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నింటినీ కనీసం 15 నిమిషాలు ఎండలో ఉంచండి. అప్పుడు నీళ్లన్నీ పూర్తిగా ఆరిపోతాయి. తర్వాత చేతిలో రెండు నుంచి మూడు చుక్కల వంట నూనె తీసుకొని అన్ని నిమ్మకాయలపై రాయండి. అప్పుడు పై భాగం శుభ్రమై నిమ్మకాయపై ఒక సన్నని పొర ఏర్పడుతుంది.
దీనివల్ల బయట నుంచి బ్యాక్టీరియా ప్రవేశించలేదు. అయితే, నిమ్మకాయలకు ఎక్కువ నూనె అంటకుండా జాగ్రత్త వహించండి. గాలి చొరబడని గాజు పాత్రలో నిమ్మకాయలను వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. మీరు నిమ్మకాయలను ఒకటి నుంచి రెండు నెలలు మాత్రమే ఉంచాలనుకుంటే వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. 4-5 నెలలు ఉంచాలనుకుంటే ఫ్రీజర్‌లో ఉంచండి. నిమ్మకాయలను ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో ఉంచండి. నిమ్మకాయను ఉపయోగించే ముందు వేడి నీటిలో వేసి పది నిమిషాలు ముంచండి. నీరు మరిగేలా జాగ్రత్త వహించండి. అది మెత్తగా మారినప్పుడు దానిని నీటి నుంచి తీసి పిండితే రసం వస్తుంది.