ఎవరికైనా అనుకున్నది జరగకపోయినా, ఎప్పటికప్పుడు కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నా అంతా టైం బ్యాడ్ అనుకుంటుంటారు. కొందరైతే తమ జాతకం బాగా లేదని భావిస్తారు. ఇంకొందరికైతే అనుకున్నవి కాకుండా అనుకోనివి కూడా కలసి వస్తుంటాయి. వారికి టైం బాగుంది, కాబట్టే అంతలా కలిసివస్తుందని అందరూ భావిస్తారు. అయితే జాతకాలను, జ్యోతిష్యాన్ని నమ్మే వ్యక్తులు ఇలా చెబుతారు. వాటిపై నమ్మకం లేని వారు అస్సలు వాటిని పట్టించుకోరు, అది వేరే విషయం. కానీ జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారమైతే టైంకు, జాతకానికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించిన తేదీ, సమయాలను బట్టేగా పండితులు వారి జాతకాలను నిర్ణయిస్తారు. ఈ క్రమంలో ఎవరైనా రోజులో ఒక నిర్దిష్ట సమయంలో జన్మిస్తే వారు కొన్ని లక్షణాలను, మనస్తత్వాలను కలిగి ఉంటారట. ఆ సమయాన్ని బట్టే వారి జాతకం గురించిన కొన్ని విషయాలను తెలుసుకోవచ్చట. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయం 4 నుంచి 6 గంటల మధ్యలో జన్మించిన వారైతే… వీరు అనారోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులకు ఉన్న అసూయ కారణంగా వీరు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అనుకున్న పనిని పూర్తి చేయడంలో అమితమైన పట్టుదలను కలిగి ఉంటారు. తమపై తమకు దృఢమైన నమ్మకం ఉంటుంది. వీరి భవిష్యత్ ఆశించిన స్థాయిలో ఆశాజనకంగానే ఉంటుంది. కానీ వీరు అనుకున్నవి చాలా నెమ్మదిగా జరుగుతాయి. అయితే అలా నెమ్మదించినా చివరకు వీరు తాము అనుకున్నది సాధిస్తారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో… ఈ సమయంలో జన్మించిన వారికి జీవితంలో చాలా రహస్యాలు ఉంటాయి. వీరు కొద్దిగా ఆశించినా అమితమైన ఫలితం దక్కుతుంది. అయితే వీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమశిక్షణతో, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. సరైన బిజినెస్ ఏదో తెలుసుకుని అందులో పెట్టుబడి పెడితే దాంట్లో రాణిస్తారు.
ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య… ఈ సమయంలో జన్మించిన వారు డబ్బుపై అమితంగా దృష్టి సారించాలి. అది వారికి స్నేహితులను, సంబంధాలను ఇస్తుంది. ఇలాంటి వారు తాము అనుకున్నది నెరవేరకపోతే నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య… వీరు ప్రతి చిన్న విషయంలోనూ విజయాన్ని చవిచూస్తారు. అత్యంత అదృష్టకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఎంత అదృష్టం ఉన్నా దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య… వీరు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారు. వీరికి జాలి, దయ, కరుణ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరిని అందరూ ఇష్టపడతారు. వీళ్లు కష్టపడితే జీవితంలో ప్రముఖ వ్యక్తులుగా ఎదిగేందుకు వీలుంటుంది.
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య జన్మించిన వారు… వీరు అకౌంటింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, ఫండ్ స్కీమ్స్ వంటి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. వీరు ఎవరినైనా శాసించగలుగుతారు. వీరి సెక్స్ లైఫ్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య… వీరికి జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి. మంచి విలువ, ప్రాధాన్యత ఉంటుంది. వీరు అన్ని విషయాల్లోనూ బాగా కష్టపడాలి. వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు. చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించాలి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య… వీరు ఎక్కువగా సమాజ సేవపై ఆసక్తి చూపుతారు. కుటుంబానికి అంతగా ప్రాధాన్యతను ఇవ్వరు. ఇతరులతో వీరు ఎలాగైతే ఉంటారో, ఇతరులు కూడా వీరితో అలాగే ఉంటారు. కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. మంచి గుర్తింపు, ఐశ్వర్యం పొందగలుగుతారు.
రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య… వీరు సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు. వీరు ఆశావాదులుగా ఉంటారు. తమకు ఇష్టమైన రంగంలోనే ఉద్యోగం సంపాదిస్తారు. విజయం కూడా సాధిస్తారు. కానీ కొన్ని సమయాల్లో ఇతరులు ఇచ్చే సలహాలను లక్ష్య పెట్టరు. దీంతో ఇబ్బందులకు గురి అవుతారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య… ఈ సమయంలో జన్మించిన వారు డబ్బు సంపాదించడం కొంత కష్టమే. అయితే వీరు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రాణించగలుగుతారు. ఇది ధనం సంపాదించిపెడుతుంది. వీరు ఎక్కువగా కష్టాలు, నష్టాలు, అపజయాలను ఎదుర్కొంటారు. రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య… వీరికి ఎక్కువగా విహార యాత్రలపై ఆసక్తి ఉంటుంది. సాహసాలు చేయాలని భావిస్తుంటారు. వీరు మీడియా రంగంలో రాణిస్తారు. రాత్రి 2 నుంచి ఉదయం 4 గంటల మధ్య… ఈ సమయంలో జన్మించిన వారు ఫుడ్ ఇండస్ట్రీలో ఉద్యోగం సంపాదిస్తారు. వీరు కుకింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది.