మేము సదరన్ కాలిఫోర్నియాలో అపార్ట్‌మెంట్లో అద్దెకి ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు మా క్రింద వాటాలో ఒక పాకిస్తానీ కుటుంబం అద్దెకి ఉండేది. వాళ్ళని ఒక్క మాటలో వర్ణించవలసివస్తే కలుపుగోలుతనం అనాలి. ఆమె పేరు రెహనా, అతని పేరు అన్వర్. అతనికి డౌన్‌టౌన్‌లో గార్మెంట్ డిస్ట్రిక్ట్‌లో బట్టల షాపు ఉండేది. ఆమె అప్పుడు గర్భవతి, వాళ్ళతోపాటు అతని అన్న కొడుకు 10-12 ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు. ఆమె ఉర్దూ (హిందీ) మాట్లాడేది, ఇంగ్లీష్ అంతబాగా వచ్చేది కాదు. మమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు (వేషభాషలవీ చూసి) ఇండియానించి వచ్చారా? అని హిందీలో అడిగింది. మేము ఆమెని మారుప్రశ్న అడిగేలోగా, ఆమే మేము పాకిస్తాన్ నుంచి వచ్చాము అని చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మంది. మన గవర్నమెంట్లకి విరోధం ఉన్నా, మనమంతా బ్రదర్సే! అంది.
మేము అప్పటికి కొంతకాలంగా అమెరికాలో ఉండడం వల్ల, ఆసియన్స్‌తో పరిచయం మాకు కొత్త కాదు. ఆమే త్వరగా ఇల్లాలితో జతకట్టింది. తను అప్పుడు ఇంకా యూనివర్సిటీలో ఉండడం వల్ల ఎక్కువసేపు ఇంట్లో ఉండేది, రెహనా చాలాసార్లు మాయింటికి వచ్చి, సగం ఇంగ్లీషు, సగం హిందీలో కబుర్లు చెప్తూ ఉండేది. ఒకసారి సన్నటి దారం తీసుకొచ్చి ఇల్లాలిని కనుబొమ్మలు త్రెడ్ చేయమని అడిగింది, తను అలాంటివాటికి ఆమడ దూరం, నాకా విద్య రాదంటే, ఆమే తనకి నేర్పబోయింది కూడా. అతను, వాళ్ళ మేనల్లుడు రోజుకు ఐదుమార్లు నమాజ్ చేసేవారో లేదో మాకు తెలీదు కానీ, ఆమె మాత్రం ఎప్పుడూ వేళతప్పక నమాజ్ చేసేది. నెలలు నిండుతున్నా, రమాదాన్ ఉపవాసాలు కూడా చేసేది. రమాదాన్ రోజుల్లో వాళ్ళు వండుకొన్న పిండివటలు మేనల్లుడితో మాకు పైకి పంపేది.
మేము శాకాహారులం, హలీం వగైరా తినమంటే, నొచ్చుకుని, ఆమే మెట్లెక్కి పైకి వచ్చి, మేం ఏం తింటామో కనుక్కుని, తరవాత కనీసం నాలుగు ఐదు సార్లు మాకు ప్రత్యేకంగా ఖీర్ కూర్మా లాంటి శాకాహారం చేసి పట్టుకొచ్చేది. ఉపవాసాలు చేస్తూ, వంటంతా చేసి, నెలలు నిండిన ఆమె మెట్లెక్కి వస్తే, మాకే భయంగా ఉండేది. (ఆమెకి అంతకు ముందు ఒకసారి గర్భస్రావం అయిందట). మా వంటలు (పులిహోర, బొబ్బట్లు, పాయసం లాంటివి) వాళ్ళకి రుచి చూపితే, ఆమె అవి ఎలా చేసేవారో శ్రద్ధగా తెలుసుకొనేది. అతను మా షాపుకు రండి, తక్కువ ధరలకి టీషర్టులు అమ్ముతాను అనేవాడు. మాకు పాకిస్తానీ పొరుగువాళ్ళున్నారని ఇండియాలో మావాళ్ళకి చెబితే వాళ్ళలో కొందరు బాబోయ్! పాకిస్తానీ వాళ్ళా? జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇప్పుడు ఇరవై ఏళ్ళకి పైన ప్రవాస జీవితంలో ఎంతో మంది భారతదేశానికి శత్రుదేశాల — చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశీయులని కలుసుకొన్నాను, కలిసి పని చేశాను.
ఈ దేశాలవారు అమెరికాలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మొదటిసారి చూసినప్పుడు కలిగే ఆలోచన వీళ్ళు మనకి విరోధులు! అని మాత్రం కాదు, వీళ్ళూ మనలాగే ఇమిగ్రెంట్సే! ప్రవాసంలో వాళ్ళకీ, మనకీ ఒకరకమైన నేపథ్యం, అవసరాలు, సమస్యలూ ఉన్నాయి అని! ప్యూ రీసెర్చ్ సెంటర్ గణాంకాల ప్రకారం 40 మిలియన్ల మంది ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారు (మూలం), అంటే, ప్రతి ఏడుగురిలో ఒకరు మరొకదేశంలో పుట్టినవారు. అందులో అమెరికాకు శత్రుదేశాలైన రష్యా, చైనా, క్యూబా ఇతరదేశాలవారు ఎంతమందో! ఎన్ని రకాల భాషలు, సంస్కృతులు, విలువలు! చిన్నప్పటినుండీ భారతదేశంలో భిన్నత్వలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా అని (నూరిపోస్తే) వింటూ పెరిగాను, స్వదేశంలో నేనెరిగిన భిన్నత్వం అంటే, ఎడమపమిట బదులు కుడిపమిట వేసుకోవడం, బావున్నారా? బదులు మంచిగున్నారా? అనడం, సౌత్ వాళ్ళను నార్త్ వాళ్ళు తక్కువగా చూడడం, భిన్నత్వాన్ని రాజకీయనాయకులు స్వార్థప్రయోజనాలకోసం ఎగదోయడం, ఇదే.
నేను దేశం విడిచిపెట్టకుండా ఉంటే, ఒక్క విదేశీవ్యక్తిని కూడా ప్రత్యక్షంగా కలుసుకోకుండానే జీవితమంతా గడిపినా ఆశ్చర్యపోను. విదేశీయులతో ఏవిధమైన ప్రత్యక్ష సంపర్కమూ లేకుండా ఎందరో గడుపుతారు. (వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు) సినిమాలలో కూడా పాకిస్తానీవారిని ఏకపక్షంగా చిత్రిస్తారు. ఆ సినిమాలు తీసేవారు, కథలు రాసేవారిలో ఎందరు విదేశీయులతో నిత్యం జీవితం గడుపుతారో? కానీ, నిజమైన భిన్నత్వలో ఏకత్వం అంటే ఏమిటో నాకు ప్రవాస జీవితంతోనే తెలిసింది. నా ఆహారపు అలవాట్లు, అభిరుచుల కన్నా వేరేవి ఉన్నవారినీ, నేను నమ్మే విలువలకన్నా భిన్నమైన విలువలు ఉన్నవారినీ కలుసుకోవడం, వారితో దగ్గరగా మసలడం వల్ల నా జీవితం చైతన్యవంతం, భాగ్యవంతం అయింది, జ్ఞానవంతం (enrich) అయింది. ఆ పాకిస్తానీ కుటుంబం కూడా ఆ చైతన్యానికీ, జ్ఞానదీపానికీ కాసింత నూనె పోసింది.