Fatty Liver : మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అవయవాల్లో లివర్ అతి పెద్ద అవయవం. ఇది అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. మన శరీర మెటబాలిజం సరిగ్గా ఉండేందుకు లివర్ దోహదపడుతుంది. ఈ క్రమంలోనే లివర్‌లో పలు రకాల కొవ్వులు నిల్వ అవుతుంటాయి. అయితే ఒక స్థాయి వరకు ఆ కొవ్వులు లివర్‌లో నిల్వ ఉంటే ఏమీ కాదు, కానీ ఆ లెవల్ దాటితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. లివర్‌లో కొవ్వు స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే పలు వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలోనే ఫ్యాటీ లివర్ వ్యాధి ముఖ్యంగా అనేక మందిలో వస్తుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒక ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే.. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల వస్తుంది. అదే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అంటే.. సరైన డైట్ పాటించకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, తీపి పదార్థాలు, కొవ్వులు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. అయితే రెండింటిలో ఏ తరహా ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చినా లివర్‌కు ప్రమాదమే. ఈ క్రమంలోనే మన శరీరం కొన్ని లక్షణాలను కూడా తెలియజేస్తుంది. అవేమిటంటే..
ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే జీర్ణాశయం పై భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. కడుపునొప్పి తరచూ వస్తుంటుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. వాంతులు అవుతుంటాయి. కొన్ని సార్లు వాంతుల్లో రక్తం కూడా పడుతుంది. కొందరికి కామెర్లు అవుతాయి. దీంతో శరీరం పుసుపు రంగులోకి మారుతుంది. కళ్లు, చర్మం పసుపు రంగులో కనిపిస్తాయి. మలం డార్క్ కలర్‌లో వస్తుంది. పొట్ట, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తాయి. చర్మంపై దురదలు వస్తుంటాయి. చిన్న దెబ్బ తగిలినా రక్త స్రావం అవుతుంది. సులభంగా గాయాలు అవుతుంటాయి.
ఇవే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో కొందరిలో అరచేతుల్లో ఎరుపు రంగులో మచ్చలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే లివర్‌లో కొవ్వు అధికంగా చేరిందని తెలుసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. లివర్ సమస్య ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడుకోవాలి.
ఇక ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి. వేళకు భోజనం చేయాలి. అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి.
ఉదయాన్నే పరగడుపునే ఉసిరికాయ జ్యూస్ లేదా వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగాలి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ సమయంలో బీట్ రూట్ జ్యూస్ లేదా ఒక కప్పు బీట్ రూట్ ముక్కలను తినాలి. మధ్యాహ్నం భోజనం సమయంలో క్యారెట్, బీట్‌రూట్, కీరదోస వంటివి తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్ రూపంలో బాదంపప్పు, పిస్తా వంటివి తినాలి. ఇక రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం కలిపి తాగాలి. పాలలో మిరియాల పొడి లేదా పసుపు కలిపి కూడా తాగవచ్చు. ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు.