Vitamins Deficiency : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం అనేక రకాల పోషకాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాలు లోపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం పోషకాహార లోపమేనని మనలో చాలా మందికి తెలియదు. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడమే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. శరీరంలో పోషకాహార లోపం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు ఏమిటి.. అలాగే ఈ సమస్యను ఎలా అధిగమించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనలో చాలా మంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం శరీరంలో క్యాల్షియం లోపించడం. రోజూ పాలను తాగడం అలాగే పాలతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం, ఆకుకూరలు, నువ్వులు , చేపలు వంటివి తీసుకోవడం వల్ల మనం ఈ సమస్యను చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే మనలో చాలా మందికి దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు చిగుర్ల నుండి రక్తం కారడం, దంతాల నుండి రక్తం కారడం, నాలుక మీద పగుళ్లు వంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ సి లోపించిందని అర్థం. విటమిన్ సి లోపిస్తే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీంతో మనం తరచూ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. నిమ్మజాతి పండ్లను తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఉసిరి, బత్తాయి, కమలా, జామకాయ వంటి వాటిని తీసుకోవడం వల్ల మనం విటమిన్ సి లోపాన్ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా గోర్లు విరగడం, జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే మన శరీరంలో విటమిన్ బి7 (బయోటిన్ ) లోపించిందని అర్థం. ఈ లోపాన్ని అధిగమించడానికి మనం విటమిన్ బి 7 ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీనికోసం మనం గుడ్లు, చేపలు, అరటిపండ్లు, వేరుశనగలు, బాదం పప్పు, క్యాలీప్లవర్, చిలగడ దుంప వంటి వాటిని తీసుకోవాలి. అలాగే నీరసం, చర్మం పొడిబారడం, చర్మం పాలిపోవడం, చర్మం నిర్జీవంగా మారడం గోళ్లు పెలుసుగా మారడం వంటి లక్షణాలు కనుక మీలో కనిపిస్తే మీ శరీరంలో ఐరన్ తగ్గిందని అర్థం. దీనికోసం చికెన్ లివర్, మునగాకు, దానిమ్మ గింజలు, బీట్ రూట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. అదే విధంగా గోర్లపై చాలా మందికి తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. దీనికి కారణం శరీరంలో జింక్ లోపించడమే. జింక్ లోపించడం వల్ల పురుషులకు గడ్డం సరిగ్గా రాదు. అలాగే వారిలో లైంగిక సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి గానూ మనం బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పప్పు దినుసులు, మటన్ లివర్ వంటి వాటిని తీసుకోవాలి. అదే విధంగా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో బి విటమిన్స్ కూడా ఒకటి. బి విటమిన్స్ లోపించడం వల్ల పాదాల పగుళ్లు, కంటిచూపు మందగించడం, నోటిలో పుండ్లు, చేతి గోర్ల మీద గీతలు రావడం, చేతి గోర్లు రంగు మారడం, చేతులు పొడిబారడం, జుట్టు చిట్లడం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం, శరీరం అలసిపోవడం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
పండ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు వంటి వాటిని తీసుకోవడం వల్ల మనం బి విటమిన్స్ లోపాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. కంటి చూపు మందగించడం, చేతిలో గోర్లు పెరుగుదలలో మార్పులు రావడం, కళ్లు రాత్రి పూట సరిగ్గా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ ఎ లోపించిందని అర్థం. క్యారెట్, ఆకుకూరలు, చిలగడ దుంపలు, నెయ్యి, చేపలు, గుడ్లు వంటి వాటిని తీసుకోవడం వల్ల మనం ఈ లోపాన్ని అధిగమించవచ్చు. అలాగే తరచూ కండరాలు పట్టేసినట్టు ఉంటే మన శరీరంలో విటమిన్ ఇ లోపించిందని అర్థం. నానబెట్టిన బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ విధంగా పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.