Korra Dosa : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్రలు ఒకటి. కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కొర్రలను ఆహారంగా తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకలు, కండరాలు ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. ఈ విధంగా కొర్రలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఈ కొర్రలతో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. కొర్రల దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బియ్యం, నూనె వాడకుండా కొర్రల దోశలను ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రల దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొర్రలు – రెండు టీ గ్లాసులు, మినప పప్పు – ఒక టీ గ్లాస్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.

కొర్రల దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కొర్రలు, మినప పప్పును తీసుకుని శుబ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిపై మూతను ఉంచి రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఉప్పు, నీళ్లు పోసి దోశ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. తరువాత వీటిపై మీగడను వేసుకోవాలి. దోశ చక్కగా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొర్రల దోశలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కొర్రల దోశలను తయారు చేసుకుని రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.