Stroke : ఈరోజులలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని తప్పులు చేయకూడదు. అయితే, ఈ రోజుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. చాలామంది స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది..?, ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?, ఎలా స్ట్రోక్ లని మనం గుర్తించొచ్చు..?, నివారించడం ఎలా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇస్కిమిక్ స్ట్రోక్ యొక్క లక్షణాలని చూస్తే.. దృష్టి సమస్యలు, చేతులు, కాళ్లు బలహీనంగా మారిపోవడం, సమన్వయాన్ని కోల్పోవడం, ఒకవైపు ముఖం వేలాడుతూ ఉన్నట్లు ఉండడం, గందరగోళం వంటివి దీనికి లక్షణాలు. స్ట్రోక్ యొక్క అత్యంత సాధారణ లక్షణం ఏంటంటే అవయవాల బలహీనత లేదంటే పక్షవాతం. అకస్మాత్తుగా ఇతర లక్షణాలు కూడా కనపడొచ్చు. స్ట్రోక్ రావడానికి కొన్ని గంటల ముందు లేదా కొన్ని రోజులు ముందు ఇటువంటి లక్షణాలు కనబడతాయి.
కండరాల నొప్పి, కండరాల బిగుతు కారణంగా అవయవాల్ని కదిలించలేక పోతారు. శరీరంలో ఎక్కడైనా లేదంటే కీలులో ఇది ఉండొచ్చు. మెదడుకి రక్త సరఫరా తగ్గినప్పుడు, ఇతర అవయవాల మీద కూడా ప్రభావం పడుతుంది. కదలికలు సరిగా లేకపోవడం వంటివి కూడా జరుగుతాయి. కండరాల బిగుతు, తిమ్మిరి కూడా కలగొచ్చు.
స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆరోగ్య పరిస్థితుల వివరాల్లోకి వెళితే.. అధిక రక్తపోటు, కొవ్వు ఎక్కువగా ఉండడం, గుండెపోటు, రక్తహీనత, రక్తం గడ్డ కట్టడం, షుగర్ పేషెంట్లలో, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణ పరీక్షలు చేయించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువుని కంట్రోల్ లో ఉంచుకోవడం, గుండెకి మేలు చేసే ఆహారం తీసుకోవడం, మంచి నిద్రతో స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.