ఈ రోజుల్లో చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా జుట్టు తొందరగా రంగు మారిపోవడం జరుగుతోంది. పెద్దవాళ్ళు అయితే వయసైపోయిందిలే, జుట్టు తెల్లబడినా రంగు మారి కనబడినా నష్టమేముంది అనుకుంటారు. కానీ చిన్న వయసు వారు కూడా అదే సమస్యతో బాధపడుతుంటారు.. కొందరైతే జుట్టు కండిషన్ చూసుకుని డిప్రెషన్ లోకి జారుకునేవారు కూడా ఉంటారు. అయితే వీటన్నిటికి సొల్యూషన్ గా ఎంతో మంది ఫాలో అయ్యేది జుట్టుకు కలరింగ్ వేయడం. జుట్టుకు కలర్ వేయడంలో కూడా ఫాషన్ వచ్చేసింది. కొందరైతే కావాలని రాగి రంగు, తెలుపు రంగు, ఇంకా పింక్, గ్రీన్, బ్లూ వంటి రంగులు వేస్తుంటారు.
కెమికల్ పద్దతిలో జుట్టుకు రంగు వేయడం వల్ల అది తాత్కాలికంగా బాగున్నట్టు అనిపించినా జుట్టు లోపలినుండి క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. హెయిర్ డై లలో ఉపయోగించే రసాయనాలు మీ జుట్టు తంతువులను బలహీనపరుస్తాయి. ఇది జుట్టు విచ్ఛిన్నం, చివర్లు రెండుగా చీలిపోవడానికి దారితీస్తుంది. అంతేకాదు మీ జుట్టును డ్రైగా ,పెళుసుగా మారుస్తుంది. దీనివల్ల మీ జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. హెయిర్ డైలలోని రసాయనాలు మీ నెత్తిమీద దురద, ఎరుపు, మంటను కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ జుట్టు విపరీతంగా రాలే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మచ్చలకు కూడా దారితీస్తుంది.రంగులు మీ జుట్టులోని సహజ నూనెలను తొలగిస్తాయి. ఇది మీ జుట్టు నీరసంగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది.
జుట్టు ఉత్పత్తులు సంతానోత్పత్తి లేదా గర్భధారణను ప్రభావితం చేయవని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నప్పటికీ.. జుట్టు రంగులకు ఎక్కువ కాలం ఉపయోగిస్తే ఈ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మీరు గర్భవతిగా ఉంటే హెయిర్ డైలను ఉపయోగించకపోవడమే మంచిది. హెయిర్ డైలలో అమ్మోనియా, పెరాక్సైడ్, పారా-ఫెనిలెనెడియామైన్ వంటి అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. రసాయనాలు మంట, తీవ్రమైన అసౌకర్యానికి దారితీస్తుంది. అంతేకాదు రసాయనాలు మీ కళ్లకు తాకితే అది కండ్లకలకకు దారితీస్తుంది, దీనిని పింక్ ఐ అని కూడా అంటారు.