సీనియర్ నటి కస్తూరి పెద్ద చిక్కులో పడిపోయింది. ఆమెను తమిళనాడు పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై పెట్టిన కేసుకు గాను ఆమె మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె బెయిల్ పిటిషన్‌ను మదురై బెంచ్ కొట్టేసింది. దీంతో ఆమెను ఏ క్షణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజుల అంతఃపురాల్లో సేవలు చేసేందుకు వచ్చిన తెలుగు వాళ్లు తమను తాము తమిళ జాతిగా చెప్పుకుంటున్నారంటూ ఆమె వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై నాయుడు మహాజన సంఘం ఫిర్యాదు చేయడంతో తిరునగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఆమెకు కోర్టులో సైతం చుక్కెదురైంది. ఆమె హాస్యానికి కూడా ఇలాంటి కామెంట్స్ చేయకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇక కస్తూరి క్షమాపణలు చెప్పినప్పటికీ ఆమె చెప్పిన సారీలో మహిళలపై చేసిన కామెంట్లను గురించి చెప్పలేదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆమెలాంటి వాళ్లకు బెయిల్ ఇస్తే తమిళనాడుకు తెలుగు ప్రజలతో ఉన్న సంబంధాలు దెబ్బ తింటాయని, కనుక కస్తూరికి బెయిల్ ఇవ్వొద్దని అడిషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలను బలంగా వినిపించారు. దీంతో ఆ వాదనలకు కోర్టు ఏకీభవించి కస్తూరి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి పారేసింది. ఈ క్రమంలోనే కస్తూరిని పోలీసులు ఏ క్షణంలో అయినా సరే అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే సినీ విశ్లేషకులు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని అంటున్నారు. మరి చూడాలి ఏమవుతుందో.