Aloo Fry : మనం ఉడికించిన బంగాళాదుంపలతో కూడా రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఉడికించిన బంగాళాదుంపలతో చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఇలా బంగాళాదుంపలతో మనం సులభంగా చేసుకోదగిన వంటకాల్లో ఆలూ మసాలా ఫ్రై కూడా ఒకటి. సైడ్ డిష్ గా తినడానికి లేదా చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగాఉంటుంది. చాలా తక్కువ సమయంలో చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా బంగాళాదుంపలతో మసాలా ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 4( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీస్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మసాలా కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, కసూరిమెంతి – కొద్దిగా.
ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను కుక్కర్ లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, మసాలాకారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మసాలా ఫ్రై తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా ఆలూ ఫ్రైను తయారు చేసి తీసుకోవచ్చు.