Aloo Kurkure : బంగాళాదుంపలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలతో పాటు అనేక రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో ఆలూ కుర్ కురే ఒకటి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ ఆలూ కుర్ కురే లను ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులువుగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో కుర్ కురేలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కుర్ కురే తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – ఒక కిలో, పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ కుర్ కురే తయారీ విధానం..
ముందుగా పెద్దగా, గట్టిగా ఉండే బంగాళాదుంపలను తీసుకుని వాటిపై ఉండే తొక్కను తీసివేయాలి. తరువాత వాటిని 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. తరువాత బంగాళాదుంపలను నిలువుగా మందంగా స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. తరువాత ఈ స్లైసెస్ ను ఒక దాని మీద ఒకటి ఉంచి సన్నగా పొడవుగా స్ట్రిప్స్ లాగా అన్నీ ఒకే విధంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను 2 నుండి 3 సార్లు నీటితో బాగా కడగాలి. తరువాత వీటిని ఒక జల్లిగిన్నెలోకి తీసుకుని నీరు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కలన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నెమ్మదిగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె గోరు వెచ్చగా అయిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిపై మరో అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప కుర్ కురే తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ ఆలూ కుర్ కురే చక్కగా ఉంటాయి. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.