Anapakaya Challa Pulusu : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సొరకాయతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ సొరకాయతో మనం ఎంతో రుచిగా ఉండే చల్ల పులుసును తయారు చేసుకోవచ్చు. ఈ చల్ల పులుసును తయారు చేయడం చాలా తేలిక. రుచిగా ఉండడంతో పాటు చాలా సులువుగా చేసుకోగలిగే ఈ సొరకాయ చల్ల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ చల్ల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన సొరకాయ – 1( చిన్నది), తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 5 లేదా కారానికి తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – ఒక కప్పు, శనగపిండి – రెండున్నర టీ స్పూన్స్.

సొరకాయ చల్ల పులుసు తయారీ విధానం..
మందుగా పచ్చిమిర్చిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పెరుగులో శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి సొరకాయ ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
సొరకాయ ముక్కలు ఉడికిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు, ఉప్పు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ చల్ల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా చల్ల పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు. సొరకాయతో చేసిన ఈ చల్ల పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.