Fruits For Diabetics : మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. షుగర్ వ్యాధిన బారిన పడితే ఇక జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులు పండ్లను తినకూడదు, పండ్లకు దూరంగా ఉండాలి అన్న అపోహలను కలిగి ఉంటారు. ఈ అపోహ అసలు ఎంత వరకు నిజం… షుగర్ వ్యాధి గ్రస్తులు అస్సలు పండ్లను తినకూడదా.. తింటే ఎలాంటి పండ్లను తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఆహారాల్లో పండ్లు ఒకటి. పండ్ల ద్వారా మైక్రో న్యూట్రియంట్స్ తో ఇతర పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి.
దీంతో శరీరంలో రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు పండ్లను తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లను ఆహారంగా తీసుకోకపోతే వారు తీవ్రంగా నష్టపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే రోగ నిరోధక వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అవయవాలు దెబ్బతినడం, త్వరగా ఇన్ఫెక్షన్ ల బారిన పడడం వంటివి జరుగుతాయి. అలాగే షుగర్ ఉన్న వారిలో రక్తనాళాలు గట్టిపడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవడం వంటివి జరుగుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన ఈ కొలెస్ట్రాల్ తొలగించాలంటే జీర్ణమయ్యే పీచు పదార్థాలు ఎక్కువగా అవసరమవుతాయి. ఈ జీర్ణమయ్యే పీచు పదార్థాలు ఎక్కువగా పండ్లల్లో ఉంటాయి.

కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు తప్పకుండా పండ్లను ఆహారంగా తీసుకోవాలి. అలాగే పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరగడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న అపోహ మనలో చాలా మందికి ఉంది. షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా తీసుకునే పండ్లు ఉన్నాయి. తక్కువగా తీసుకునే పండ్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లను, పనస తొనలను, సపోటా, సీతాఫలం, అరటి పండ్లను, ఖర్జూర పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిల వెంటనే పెరుగుతాయి. వీటిలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ పండ్లను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాగే పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, కమలా పండ్లు, జామ పండ్లు, పైనాపిల్, ఆపిల్, దానిమ్మ వంటి పండ్లను షుగర్ వ్యాధి గ్రస్తులు ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులు పూర్తిగా పండ్లను తినడం మానేయడం వల్ల వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కనుక క్యాలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.