Aritaku Idli : మనం అల్పాహారంగా తయారు చేసే వాటిల్లో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలను మనం విరివిరిగా తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. తరచూ చేసే విధంగానే కాకుండా మనం అరటి ఆకుల్లో కూడా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. అరటి ఆకుల్లో చేసే ఈ ఇడ్లీలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాగే ఈ ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇడ్లీలను రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా అరటి ఆకుల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటాకు ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – అర కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, ఉప్పు – తగినంత, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, క్యాప్సికం తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – పావు టీ స్పూన్.
అరటాకు ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. రవ్వ నాని గట్టిగా తయారవుతుంది. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత అరటి ఆకును శుభ్రంగా కడగాలి. తరువాత దీనిని మంటపై కొద్దిగా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని ఉంచి దారంతో పొట్లంలా కట్టుకుని కళాయిలో ఉంచాలి. తరువాత ఈ కళాయిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత దీనిపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత ఒక టూత్ పిక్ ను గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు పిండి అంటుకోకుండా వస్తే ఇడ్లీ ఉడికినట్టుగా భావించాలి. ఒకవేళ పిండి అంటుకుంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇడ్లీని బయటకు తీసి మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అరటి ఇడ్లీలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే అల్పాహారాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా అరటి ఆకుల్లో కూడా ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఇడ్లీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.