Atukula Kobbari Payasam : అటుకుల కొబ్బరి పాయసం.. అటుకులు, కొబ్బరి పాలు కలిపి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. కొబ్బరి పాలు పోసి చేసి ఈ పాయసం ఎంతో కమ్మగా ఉంటుంది. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇన్ స్టాంట్ గా ఈ పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ అటుకుల కొబ్బరి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల కొబ్బరి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – అర చెక్క, మందంగా ఉండే అటుకులు – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, బెల్లం – అర కప్పు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
అటుకుల కొబ్బరి పాయసం తయారీ విధానం..
ముందుగా పచ్చికొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వస్త్రంలో వేసి దానినుండి పాలను తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరిపాలు 3 కప్పులు ఉండేలా చూసుకోవాలి. తరువాత జార్ లో అటుకులను వేసి పల్స్ ఇస్తూ బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. అలాగే గిన్నెలో బెల్లాన్ని, నీటిని పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దానిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే నెయ్యిలో అటుకులు వేసి వేయించాలి. తరువాత పాలు పోసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మంటను చిన్నగా చేసి బెల్లం నీటిని పోసి కలపాలి. బెల్లం నీరు ఉడుకుపట్టిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల కొబ్బరిపాయసం తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పాయసాన్ని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.