Beerakaya Shanaga Pappu Kura : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరగాయల్లో బీరకాయ ఒకటి. బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో బీరకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీరకాయలతో చేసిన కూరలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ బీరకాయల్లో శనగపప్పును వేసి కూడా మనం ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా తేలిక. వంటరాని వారు కూడా చేసుకునేంత సులభంగా, రుచిగా బీరకాయ శనగపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ శనగపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయలు – కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, నానబెట్టిన శనగపప్పు – 50 గ్రా., అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండు కొబ్బరి ముక్కలు – 1 టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
బీరకాయ శనగపప్పు కూర తయారీ విధానం..
ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఎండుకొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, నానబెట్టుకున్న శనగపప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కారం, మిక్సీ పట్టుకున్న ఎండుకొబ్బరి మిశ్రమం వేసి కలపాలి. తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ శనగపప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా బీరకాయ శనగపప్పు కూరను తినడం వల్ల రుచితో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.