Beetroot Chutney : మనం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో, రక్తహీనత సమస్య తలెత్తకుండా చేయడంలో ఇలా అనేక రకాలుగా బీట్ రూట్ మనకు దోహదపడుతుంది. బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బీట్ రూట్ తో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బీట్ రూట్ ను ఇష్టపడని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ బీట్ రూట్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్ రూట్ – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 3, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు- కొద్దిగా, బెల్లం – ఒక చిన్న ముక్క, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
బీట్ రూట్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బీట్ రూట్ ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. బీట్ రూట్ ముక్కలు చక్కగా వేగిన తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం, చింతపండు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.