Biyyampindi Vadiyalu : మనకు సూపర్ మార్కెట్ లో, షాపులల్లో , స్వీట్ షాపుల్లో లభించే వాటిలో బియ్యంపిండి అప్పడాలు కూడా ఒకటి. బియ్యంపిండితో చేసే ఈ అప్పడాలు చాలా రుచిగా ఉంటాయి. పప్పు, సాంబార్, రసం వంటి వాటిలోకి సైడ్ డిష్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ బియ్యంపిండి అప్పడాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట షాపుల్లో భించే విధంగా ఉండే ఈ అప్పడాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో బియ్యంపిండి ఉంటే చాలు వీటిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. బియ్యంపిండితో రుచికరమైన అప్పడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యంపిండి అప్పడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – 2 కప్పులు, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్.
బియ్యంపిండి అప్పడాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండి\ని తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో నీళ్లు తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, నువ్వులు, వంటసోడా, జీలకర్ర వేసి కలపాలి. నీళ్లు వేడయ్యాక పిండి వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో గిన్నెలో సగానికి నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యే లోపు గిన్నెలో లేదా గ్లాస్ తో వేడిగా ఉన్న పిండిని బాగా కలుపుకోవాలి. పిండి చక్కగా కలిసిన తరువాత ఈ పిండిని పెద్దపెద్ద వడలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత మరుగుతున్న నీటిపై జల్లిగిన్నెను ఉంచి వడలుగా చేసిన పిండి పెట్టాలి. తరువాత దీనిపై ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి ఉడికించాలి. వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పిండిని మాత్రమే తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టి అలాగే ఉంచాలి. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకున్న పిండిని గ్లాస్ తో లేదా గిన్నెలో మరలా బాగా కలపాలి. తరువాత నిమ్మకాయంత ఉండలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక ఉండను తీసుకుని మిగిలిన ఉండలపై మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ పేపర్ ను తీసుకుని నూనె రాయాలి. తరువాత దానిపై పిండిని ఉంచి పిండిపై మరో పేపర్ ను ఉంచాలి. తరువాత చపాతీ కర్రతో గుండ్రంగా నెమ్మదిగా వత్తుకోవాలి. తరువాత ఈ అప్పడాలను వస్త్రంపై లేదా కవర్ పై వేసుకోవాలి. ఇలా అన్ని అప్పడాలను తయారు చేసుకుని ఎండలో పెట్టి ఎండబెట్టాలి. ఎండరాని వారు ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు . అప్పడాలు పూర్తిగాఎండిన తరువాత డబ్బాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ అప్పడాలను వేడి వేడి నూనెలో వేసి వేయించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే బియ్యంపిండి అప్పడాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.