Butter Naan : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలలో లభించే వాటిల్లో బటర్ నాన్ కూడా ఒకటి. మసాలా కూరలతో కలిపి తింటే ఈ బటర్ నాన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రెస్టారెంట్ లలో రుచి చూసే ఉంటారు. ఈ బటర్ నాన్ లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తందూర్ లేకున్నా కూడా వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బటర్ నాన్ లను సులభంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ నాన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, పంచదార – పావు టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, పెరుగు – అర కప్పు, కరిగించిన బటర్ – అర కప్పు.
బటర్ నాన్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పంచదార, వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువాత నూనె, పెరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై తడి వస్త్రాన్ని కప్పి ఒక గంట పాటు పిండిని నాననివ్వాలి. గంట తరువాత చేతికి నూనెను రాసుకుంటూ పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ కోడిగుడ్డు ఆకారంలో చపాతీ కర్రతో రుద్దుకోవాలి. తరువాత దీనికి ఒకవైపు అంతా కూడా నీటితో తడి చేయాలి. తరువాత స్టవ్ మీద ఐరన్ పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక ఈ నాన్ ను తడి చేసిన వైపు కిందికి వచ్చేలా పెనం మీద వేసుకోవాలి. ఇలా తడి చేయడం వల్ల నాన్ పెనం నుండి విడిపోకుండా ఉంటుంది. దీనిని ఒక వైపు కాల్చుకున్న పెన్నాన్ని బోర్లా తిప్పి నేరుగా మంటపై నాన్ ను కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ నాన్ కు రెండు వైపులా బటర్ ను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నాన్ తయారవుతుంది. వీటిని వెజ్, నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బయట రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇలా బటర్ నాన్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు.