Cashew Nuts Tomato Curry : మన శరీరానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపపప్పులో మన శరీరానికి అవసరమయ్యే దాదాపు అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఇవి సహాయపడతాయి. జీడిపప్పును తరుచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు, చర్మ సంరక్షణతోపాటుగా దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా జీడిపప్పు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో దోహదపడుతుంది. మనం ఎక్కువగా జీడిపప్పును నేరుగా లేదా నానబెట్టుకుని తింటూ ఉంటాం. అలాగే జీడిపప్పును ఉపయోగించి రకరకాల కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే జీడిపప్పును, టమాటాలను ఉపయోగించి మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు టమాటా మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), జీడిపప్పు – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చి మిర్చి – 4, పుచ్చ గింజల పప్పు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, పెద్దగా తరిగిన టమాటాలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), నూనె – రెండు టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – అర గ్లాసు, గరం మసాలా – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, బటర్ – కొద్దిగా, ప్రెష్ క్రీమ్ – కొద్దిగా.
జీడిపప్పు టమాటా మసాలా కూర తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, పుచ్చ గింజల పప్పు, నువ్వులు వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. తరువాత పెద్దగా తరిగిన టమాటా ముక్కలను వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పును ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా పేస్ట్ లా పట్టుకున్న జీడిపప్పు, టమాటా మిశ్రమాన్ని వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత తరిగిన టమాటా ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి.
తరువాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, తరిగిన పచ్చి మిర్చి, నీళ్లను పోసి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత గరం మసాలా, కసూరి మెంతి వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత బటర్, ప్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు టమాటా మసాలా కూర తయారవుతుంది. ఇందులో ప్రెష్ క్రీమ్ కు బదులుగా పాల మీగడను కూడా వేసుకోవచ్చు. ఈ కూరను పుల్కా, పూరీ, రోటీ, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా జీడిపప్పులో ఉండే పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.