Cauliflower Bonda : మనం క్యాలీప్లవర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వీటితో మనం రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో క్యాలీప్లవర్ బోండా కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా తేలిక. క్యాలీప్లవర్ ను ఇష్టపడని వారు కూడా ఈ బోండాలను ఇష్టంగా తింటారు. క్యాలీప్లవర్ తో రుచిగా బోండాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – అరకిలో, శనగపిండి – పావు కిలో, బియ్యం పిండి – 50 గ్రా., పచ్చిమిర్చి – 7, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
క్యాలీప్లవర్ బోండా తయారీ విధానం..
ముందుగా పచ్చిమిర్చిని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఇందులోనే జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత క్యాలీప్లవర్ ముక్కలను నీటిలో వేసి 50 శాతం ఉడికించాలి. తరువాత వీటిని చల్లటి నీటిలో వేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసొ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కారం, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి అర గంట పాటు అలాగే ఉంచాలి. అర గంట తరువాత ఈ పిండిలో వంటసోడా వేసి కలపాలి.
అలాగే క్యాలీప్లవర్ ముక్కలను నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముక్కలను పిండిలో ముంచి బోండాల మాదిరి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ బోండా తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.