Kanji Vada : పండుగలప్పుడు సాధారణంగా చాలా మంది గారెలు, వడలు వంటివి చేస్తుంటారు. వివాహాలు, ఇతర విందు కార్యక్రమాల్లోనూ వడలను వడ్డిస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కొందరు వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లా తింటారు. కొందరు సాయంత్రం స్నాక్స్‌లా తింటారు. ఎలా తిన్నా సరే.. వడలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పప్పులతో వడలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని పప్పులను ఉపయోగించి కింద చెప్పిన విధంగా ఓ వెరైటీ రకానికి చెందిన వడలను చేసి తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కంజి వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – రెండున్నర కప్పులు, పచ్చి మిర్చి ముద్ద – అర టీస్పూన్, అల్లం తురుము – అర టీస్పూన్, జీలకర్ర ముద్ద – అర టీస్పూన్, ఆవాలు – పావు కప్పు, కారం – ఒకటిన్నర టీస్పూన్, బ్లాక్ సాల్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.
కంజి వడలను తయారు చేసే విధానం..
ముందుగా కంజిని ఎలా చేయాలో చూద్దాం. ఓ గిన్నెలో ఆవాలు, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. దీన్ని మిక్సీలో వేసి మెత్తని పిండిలా చేయాలి. ఇప్పుడు పిండిలో ఒకటిన్నర లీటర్ల నీళ్లను పోసి బాగా కలపాలి. దీన్నే కంజి అంటారు. దీన్ని ఒక రోజు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు వడలను తయారు చేయడం చూద్దాం. వండటానికి ఓ నాలుగు గంటల ముందు పెసరపప్పుని నానబెట్టాలి. తరువాత నీళ్లను వంపేసి ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. అవసరం అయితే నీళ్లను చల్లుకోవాలి. ఈ పిండిలోనే అల్లం తురుము, పచ్చి మిర్చి ముద్ద, ఇంగువ, జీలకర్ర ముద్ద వేసి బాగా కలపాలి.
ఇప్పుడు పాన్ లేదా వెడల్పాటి బాణలి తీసుకుని నూనె పోసి కాగాక ఈ మిశ్రమాన్ని చిన్న వడలు లేదా బొండాలుగా వేసి ఎర్రగా వేయించి తీయాలి. ఇలాగే అన్నీ వేసి తీశాక వీటిని కాసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా ఆరిన తరువాత వీటిని నీళ్లలో వేసి ఓ గంట నాననివ్వాలి. కాస్త మెత్తబడ్డాక తీసి నీళ్లు లేకుండా గరిటెలతో నొక్కేసి కంజిలో వేసి ఓ గంట నాననివ్వాలి. వడల మాదిరిగా చేసిన ఈ కంజి వడల్ని రాజస్థానీయులు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి.
అయితే వడల్ని మినప పప్పుతోనూ చేసుకోవచ్చు. ఇక కంజిని మరో రకండా కూడా చేసుకోవచ్చు. మట్టి పాత్రను తీసుకుని పొయ్యి మీద పెట్టి చిటికెడు ఇంగువ వేయాలి. అది కాలి మంచి వాసన వస్తుండగా కుండను బోర్లా తిప్పి మంట మీద ఉంచాలి. ఇప్పుడు కంజిని అందులో పోసి వడలు వేయాలి. తరువాత ఈ మొత్తాన్ని బట్టతో కట్టి ఏడెనిమిది రోజుల పాటు ఎండలో ఉంచాలి. ఆ సమయంలో ఈ కుండను రాత్రి పూట కూడా కాస్త నులివెచ్చగా ఉండే గదిలోనే ఉంచాలి. తరువాత వీటిని తీసి వడ్డిస్తారు.