చేపలను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి ఎంతో ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన కళ్లను సంరక్షిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని సంరక్షిస్తాయి. అందుకనే చేపలను తరచూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే చేపలను పులుసుగా తినడం ఇష్టం లేకపోతే వాటిని ఇగురు రూపంలో చేసి తినవచ్చు. చేపల ఇగురు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిన చేపలతో ఇగురు చేసుకుని తింటే వచ్చే మజాయే వేరు. ఈ క్రమంలోనే చేపలతో ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – అర కిలో, ఉల్లిపాయలు – నాలుగు, పచ్చి మిర్చి – ఆరు, కారం – రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, పసుపు – ఒక టీస్పూన్, టమాటా – రెండు, అల్లం వెల్లుల్లి – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము – రెండు టేబుల్ స్పూన్లు, నూనె – అర కప్పు, ఉప్పు – తగినంత.
చేపల ఇగురును తయారు చేసే విధానం..
ముందుగా చేప ముక్కల్ని కడిగి వాటికి అర టీస్పూన్ చొప్పున పసుపు, ఉప్పు, కారం పట్టించి అర గంట సేపు నానబెట్టాలి. తరువాత కాగిన నూనెలో ముక్కల్ని వేయించి తీయాలి. అదే బాణలిలో మిగిలిన నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన చేప ముక్కలు వేసి సుమారుగా పది నిమిషాల పాటు దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి. ఎంతో రుచిగా ఉండే చేపల ఇగురు రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.