Chicken Biryani In Cooker : చికెన్ బిర్యానీ.. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ చికెన్ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే చాలా మంది బిర్యానీని తయారు చేయడం శ్రమతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ తక్కువ శ్రమతో తక్కువ సమయంలో కుక్కర్ లో కూడా మనం చికెన్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా కుక్కర్ లో బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ లో రుచిగా, సులభంగా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 గ్లాసులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), పొడుగ్గా తరిగిన టమాట – 1, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, తరిగిన పుదీనా – గుప్పెడు, నెయ్యి – 2 టీ స్పూన్స్, నీళ్లు – 3 గ్లాసులు
చికెన్ మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – ముప్పావు కిలో, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా – ఒక టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
మసాలా దినుసులు..
దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 4, యాలకులు – 4, సాజీరా – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, బిర్యానీ ఆకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా.
చికెన్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి గంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. ఈ చికెన్ ను 15 నిమిషాల పాటు బాగా వేయించాలి.
చికెన్ వేగిన తరువాత బియ్యం, నీళ్లు, కొత్తిమీర, పుదీనా వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత కుక్కర్ పై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తరువాత దీనిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ తయారవుతుంది. దీనిని రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా రుచిగా మనం చికెన్ బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.