Chicken Handi : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలలో లభించే చికెన్ వెరైటీలలో చికెన్ హండి కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ కూర క్రీమిగా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ చికెన్ హండి చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ లలో లభించే ఈ చికెన్ హండిని మనం ఇంట్లో కూడా అదే రుచిగా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ లలో లభించే చికెన్ హండిని అదే రుచితో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ హండి తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – 500 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, బిర్యానీఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, అల్లం పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, చిలికిన పెరుగు – పావు కప్పు, కసూరి మెంతి – ఒక టేబుల్ స్పూన్, క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 200 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ హండి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత మంటను మధ్యస్థంగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి పచ్చిమిర్చి, పెరుగు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి మంటను మధ్యస్థంగా చేసుకోవాలి.
దీనిని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కసూరి మెంతి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ హండి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ వంటకాలతో పాటు ఇలా అప్పుడప్పుడూ మరింత రుచిగా ఈ విధంగా చికెన్ హండిని తయారు చేసుకుని తినవచ్చు.